భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం

6 Aug, 2020 10:51 IST|Sakshi

ముంబై: భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. నగరంలో ప్రజారవాణా సేవలు అన్ని స్తంభించాయి. ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడ నిలిచిపోయింది. వర్షాలు అధికంగా కురుస్తుండటంలో ముంబై, పుణెలో రెడ్‌అలర్ట్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర సేవలు మినహా దుకాణాలు, మిగిలిన కార్యాలయాలన్ని మూతపడ్డాయి. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు సూచించారు. సహాయక చర్యల కోసం మహారాష్ట్రలో 16 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను ఉంచారు. ముంబైలో 5 , కొల్హాపూర్‌లో 4, సాంగ్లీలో 2, సతారా, థానే, పాల్ఘర్, నాగ్‌పూర్, రాయ్‌గడ్‌లలో ఒక్కో బృందం చొప్పున మొహరించారు. 

కుండపోత వర్షాలతో వరద నీరు జేజే ఆసుపత్రిలోకి ప్రవేశించింది. నీటిని తొలగించామని, ఇప్పుడు ఆసుపత్రిలో నీరు చేరడం లేదని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ తెలిపింది. వాతావరణ శాఖ కొలాబా సెంటర్ 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షాన్ని రికార్డు చేసింది. 1974 తర్వాత 24 గంటల వ్యవధిలో ఆగస్టులోనే అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

చదవండి: ‘ముంబై మానవత్వం కోల్పోయింది’

మరిన్ని వార్తలు