-

మహారాష్ట్రకు మరో టెన్షన్‌.. మీజిల్స్‌ వైరస్‌తో చిన్నారులు మృతి

27 Nov, 2022 15:26 IST|Sakshi

కరోనా సమయంలో వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్‌ వైరస్‌ టెన్షన్‌ పెడుతోంది. మీజిల్స్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్‌ చేస్తోంది. 

వివరాల ‍ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్‌ వైరస్‌ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్‌ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్‌ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్‌-రుబెల్లా స్పెషల్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్‌ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్‌ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్‌ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్‌ 20వ తేదీన వైరస్‌ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్‌ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు.  ఇక, మీజిల్స్‌ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్‌ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్‌, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్‌, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు