లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: ముంబైలో ​భారీగా తగ్గిన కొత్త కేసులు..

4 May, 2021 11:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొదటిదశలో​ కంటే రెండో దశలో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వైరస్‌ వ్యాప్తి మహరాష్ట్రలో తీవ్రంగా ఉండేది. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఎంతోమంది ఆసుపత్రుల్లో చేరారు. కానీ అక్కడి ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, వెంటిలేటర్‌, వ్యాక్సిన్‌ల కొరత తీవ్రంగా ఉండేది. 

దీంతో కరోనా కట్టడి కావాలంటే అది లాక్‌డౌన్‌తోనే సాధ్యమని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భావించారు. వెంటనే గత నెలలో లాక్‌డౌన్‌ కూడా ప్రకటించారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయిదు వారాల తర్వాత ఆర్థిక రాజధాని ముంబైలో కేసుల సంఖ్య తక్కువగా నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం, గడచిన 24 గంటలలో కొత్తగా 2,624 కరోనా కేసులు నమోదవగా,  ​59,500 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  

గత 5 వారాలతో పోలిస్తే.. ​ఇవే అతితక్కువ కేసులు కావడం గమనార్హం. గతంలో మరణాల సంఖ్య 13,372 గా ఉండగా, ప్రస్తుతం అది 78కి తగ్గింది. గత ఆదివారం నాడు కరోనా పరీక్షల సంఖ్య 50,000 నుంచి 38 వేలకు తగ్గింది. ప్రస్తుతం, ముంబైలో 6,58,621 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ముంబైలో సెకండ్‌ వేవ్‌  మార్చి నుంచి తీవ్ర ప్రమాదకరంగా మారింది. అప్పటి నుంచి ప్రతిరోజు వేలసంఖ్యలో కొత్త కేసులు, మరణాలు సంభవించాయి. ఫలితంగా దేశంలోనే కోవిడ్‌తో అ‍త్యంత నష్టపోయిన నగరాలలో ఒకటిగా ముంబై నిలిచింది. గడచిన, మార్చి,ఏప్రిల్‌లలో ఒక్క రోజులో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు దానిసంఖ్య 48వేలకు తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా .. కరోనా నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 84.7 శాతంకాగా, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు