ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా చంపేయండి‌

15 Apr, 2021 12:41 IST|Sakshi
వీడియో దృశ్యాలు

ముంబై : కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశంలో మహారాష్ట్రపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా పడిందనే చెప్పాలి. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి వైద్యం కోసం అతని కొడుకు 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులను తిరిగినా ఒక్క బెడ్‌ కూడా దొరకని దయనీయమైన దుస్థితి ఏర్పడింది. చివరకు చేసేదేమిలేక ఆస్పత్రిలో చేర్చుకొని బెడ్‌ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్‌ ఇచ్చి చంపమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రోగి కుమారుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన సాగర్ కిశోర్‌ నహర్షివర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని అంబులెన్స్‌లో ఉంచి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ కనికరించడం లేదు. మొదట చంద్రాపూర్‌లోని వరోరా హాస్పిటల్‌కు వెళ్లగా, అక్కడ వాళ్లు కుదరదని మరో చోటుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక అక్కడి నుంచి పలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లినా ఏం లాభం లేకపోయింది. చివరకు రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు కూడా వెళ్లినప్పటికీ, అక్కడ సైతం చికిత్స అందించలేకపోయారు. ఇక చేసేదేమిలేక మళ్లీ ఉదయం తిరిగి మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. 24 గంటల నుంచి తన తండ్రి అంబులెన్సులోనే ఉన్నాడని కిశోర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి  చికిత్స అందించడం కోసం చేయని ప్రయత్నం లేదని బాధపడుతున్నాడు.

( చదవండి: మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్‌డౌన్‌ )

>
మరిన్ని వార్తలు