12 మంది ఎమ్మెల్యేల వేతనాలు నిలిపివేత 

22 Jul, 2021 00:32 IST|Sakshi

సస్పెండ్‌లో ఉన్నంత కాలం ఇతర భత్యాలకూ కోత 

వర్షాకాల సమావేశాల్లో సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు 

సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో దురుసుగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి సస్పెండ్‌కు గురైన 12 మంది బీజేపీ ఎమ్మెల్యే గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంతేగాకుండా ఎమ్మెల్యేలు సస్పెండ్‌లో ఉన్నంత కాలంలో వారికి నెలనెలా చెల్లించాల్సిన గౌరవ వేతనంతోపాటు ఇతర భత్యాలు కూడా ఇప్పటికే సస్పెండ్‌ వేటు పడడంతో 12 మంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు గౌరవ వేతనం, ఇతర భత్యాలు కూడా నిలిపివేయడంతో పుండు మీద కారం చల్లినట్లుగా మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  

సస్పెండ్‌కు దారితీసిన అంశాలు 
ముంబైలో ఈ నెల 5,6 తేదీల్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. సమావేశాల మొదటిరోజే ఓబీసీ రిజర్వేషన్‌ అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గట్టిగా నినాదాలు చేశారు. సభా కార్యకలపాలు కొనసాగకుండా విఘాతం కల్గించారు. దీంతో సభ కార్యకలాపాలు కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. సభ వాయిదా పడగానే కోపోద్రిక్తులైన కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సభాధ్యక్షుడు భాస్కర్‌ జాదవ్‌ చాంబర్‌లోకి వెళ్లి ఆయన్ని దూషించారనే కారణంతో బాధ్యులైన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సంవత్సర కాలంపాటు వేటు వేశారు. ఆ తర్వాత అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు సస్పెండ్‌ వేటు పడిన 12 మంది ఎమ్మెల్యేలు మరుసటి రోజు జరిగిన సభా కార్యకలాపాలకు హాజరు కాలేదు. ఇదిలాఉండగా భాస్కర్‌ జాధవ్‌ను దూషించలేదని, అక్కడ బీజేపీ, శివసేన ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగిందని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారు. అంతేగాకుండా ఈ విషయంపై బీజేపీ నాయకులు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ అయ్యారు. అంతటితో ఊరుకోకుండా కోర్టును కూడా ఆశ్రయించారు.

తేరుకోకముందే.. 
సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యేల గౌరవ వేతనంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు చెల్లిస్తున్న భత్యం, భవిష్యత్తులో సమితి సమావేశాలకు హాజరైనందుకు చెల్లించే భత్యాలు నిలిపివేయాలనే ప్రతిపాదన విధానసభ ఉపాధ్యక్షుడు నరహరీ జిరవాల్‌కు ప్రభుత్వం పంపించింది. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలతో చర్చించిన జిరవాల్‌ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో ఇక నుంచి సస్పెండ్‌ వేటు పడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సంవత్సర కాలంపాటు గౌరవ వేతనం, ఇతర భత్యాలకు వంచితులు కావల్సి ఉంటుంది. సస్పెండ్‌ వేటుతో తేరుకోకముందే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.  

సమంజసం కాదు: ఫడణవీస్‌
ఎమ్మెల్యేల గౌరవ వేతనం, ఇతర భత్యాలు నిలిపివేయడం సమంజసం కాదని దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందన్నారు.  

వేతనం, భత్యం వివరాలు 
ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.2,40,973 గౌరవ వేతనం చెల్లిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు రోజుకు రూ.2 వేల భత్యం, అలాగే సమావేశాలకు హాజరైనందుకు రోజుకు రూ.2 వేలు చెల్లిస్తుంది.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు