‘ప్రదీప్‌ శర్మకు నా భర్త కలెక్షన్‌ ఏజెంట్‌’

21 Jun, 2021 10:56 IST|Sakshi
ప్రదీప్‌ శర్మకు తన భర్త కలెక్షన్‌ ఏజెంట్‌గా వ్యవహరించేవాడంటూ ఎన్‌ఐఏ అధికారులను ఆశ్రయించిన గుంజన్‌

ఎన్‌ఐఏ అధికారులను ఆశ్రయించిన మహిళ

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ప్రదీప్‌ శర్మకు తన భర్త కలెక్షన్‌ ఏజెంట్‌గా వ్యవహరించేవాడని ఆరోపణ

ముంబై: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్‌ శ‌ర్మను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్‌ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్‌ శర్మకు కలెక్షన్‌ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్‌ సింగ్‌(30) అనే మహిళ తన భర్త అనీల్‌ సింగ్‌ ప్రదీప్‌ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్‌ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. 

ఈ సందర్భంగా గుంజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్‌ సింగ్‌ కోసం పని చేసిన ప్రదీప్‌ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్‌ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్‌ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్‌ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్‌ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్‌ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్‌ఐఏ ప్రదీప్‌ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేశారు

చదవండి: మాజీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ప్రదీప్‌ శర్మ అరెస్టు 

మరిన్ని వార్తలు