వర్షం పడిందంటే భయం భయంగా.. 29 ఏళ్లలో 290 మంది మృతి

20 Jul, 2021 00:19 IST|Sakshi

ఏటా ప్రాణాల్ని బలి తీసుకుంటున్న కొండచరియలు

ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు 

సాక్షి, ముంబై: గడిచిన 29 ఏళ్లలో ముంబై నగరం, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో కొండచరియలు విరిగిపడిన సుమారు 290 మందికిపైగా మృతి చెంది నట్లు తెలిసింది. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వికలాంగులుగా మారారు. ఏటా ఇలాంటి ప్రమాదాలు జరగ్గానే కొండలపై, వాటి కింద గుడిసెల్లో ఉంటున్న పేద కటుంబాల అంశం తెరమీదకు వస్తుంది. ఆ తరువాత షరా మామూలే అవుతుంది.

ప్రమాదం జరగ్గానే ఆగమేఘాల మీద మంత్రులు, ప్రభుత్వ, బీఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం, మృతు లకుటుంబాలకు సానుభూతి ప్రకటించడం, ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపేసుకుంటున్నా రు. అవసరమైతే గుడిసెలను ఖాళీచేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆదివారం ముంబైలో కురిసిన భారీ వర్షానికి వేర్వేరు సంఘటనలో దాదాపు 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య అధికంగా ఉంది.

25 నియోజకవర్గాల్లో ప్రమాదకర కొండలు.. 
1991 నుంచి 2021 వరకు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఏకంగా 25 నియోజక వర్గాలలో ప్రమాదకర కొండలున్నాయి. ఇప్పటికే ఆ కొండలపై, వాటికి ఆనుకుని అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. కొండల కింద ప్రమాదకరంగా ఉన్న 22,483 గుడిసెల్లో 9,657 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి స్థలాంతరం చేయాలని ఇదివరకే ‘ముంబై జోపడ్‌పట్టి సుధార్‌ మండలి’ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

అదేవిధంగా మిగతా గడిసెలపై కొండ చరియలు విరిగిపడకుండా ఇళ్ల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సిఫార్సు చేసింది. కానీ, ఇంతవరకు ప్రమాదకరంగా ఉన్న కొండలు, వాటికి ఆనుకున్న ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

ఫలితంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదిలాఉండగా కొండ పరిసర ప్రాంతా ల్లోని మురికివాడల్లో నివాసముంటున్న పేద కుటుంబాలు స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది.

లేదంటే బలవంతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం సంబంధిత అధికారులకు నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఏటా వర్షాకాలంలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదముంటుంది. కొండల కింద, కొండలపైన, చుట్టుపక్కల ఉన్న గుడిసెల్లో వేలాది కుటుంబాలున్నాయి. అందులో లక్షలాది మంది పిల్ల, పాపలతో నివాసముంటున్నారు. వర్షా కాలంలో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు వచ్చి ఇళ్లపై పడతాయి.

దీంతో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు పేద కుటుంబాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తారు. భారీ వర్షం కురి సిందంటే చాలు రాత్రులు నిద్ర లేకుండా గడుపుతా రు. దీంతో ప్రమాదం జరగకముందే సురక్షిత ప్రాం తాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. 

వర్షాకాలం భయం భయం.
ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కొండలున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు భయంభయంగా బతుకీడుస్తారు. ముంబైలో మలబార్‌ హిల్, వర్లీ సీ ఫేస్, అంటాప్‌ హిల్‌లో ప్రాంతాల్లో, ఉప నగరాల్లో ఘాట్కోపర్, విద్యావి హార్, ఎం–తూర్పు వార్డు పరి«ధిలోని దిన్‌క్వారి మార్గ్‌పై గౌతం నగర్, పాంజర్పోల్, వాసి నాకావద్ద ఓం గణేశ్‌ నగర్, రాహుల్‌ నగర్, నాగాబాబా నగర్, సహ్యాద్రి నగర్, అశోక్‌ నగర్, భారత్‌నగర్‌ తదితరా ప్రాంతాల్లో కొండల కింద ఉంటున్న ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది.

లేదంటే బలవంతంగా తరలించాల్సి వస్తుం దని హెచ్చరించింది. అయినప్పటికీ బలవంతం గా అక్కడే ఉంటే ఆ తరువాతే జరిగే పరిణామాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదానికి కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బీఎంసీ ఎలాంటి బాధ్యత వహించదని పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. అయినప్పటికీ వేలాది కుటుంబా లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే కా లం వెల్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారింది.  

మరిన్ని వార్తలు