15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్‌లో మేనేజర్‌గా అవతారం ఎత్తి..

9 Dec, 2022 15:38 IST|Sakshi

సాక్షి, గోవా: గత 15 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతన్న హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో పుర్బా మేదినీపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఏప్రిల్‌ 23, 2005న గోవాలోని కరంజాలెం వద్ద అల్టినో నివాసి గాడ్విన్‌ డీఎస్‌లీవా అనే వ్యక్తిని రుడాల్‌ గోమ్స్‌, జాక్సన్‌ డాడెల్ ‌అనే వ్యక్తులు హత్య చేశారు. అనంతరం వారిని పనాజీ పోలీసులు అరెస్టు చేసి సెషన్స్‌ కోర్టు ముందు హాజరుపర్చగా...కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది.

ఐతే ఆ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడక మునుపే జ్యుడిషియల్‌ కస్టడీ ఉన్న మిగతా 12 మంది ఇతర నిందితులతో కలిసి  జైలు గేటును తెరిచి గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఐతే అప్పటి నుంచి ఆ నిందితుల్లో జాక్సన్‌ డాడెల్‌ అనే వ్యక్తి ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఐతే అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న గోవా క్రైం బ్రాంచ్‌ పోలీసులు బృందానికి కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్‌ జాక్సన్‌ డాడెల్ ‌ఉన్నట్లు సమాచారం అందింది.

నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా పట్టణంలోని ఓ హోటల్‌లో ఆఫీస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఐతే నిందితుడు పేరు మార్చుకుని, తాను జైలు నుంచి తప్పించుకున్న తేదీనే పుట్టినరోజు తేదీగా మార్చకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ సూరజ్ నేతృత్వంలోని గోవా క్రైం బ్రాంచ్‌ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మార్గోవ్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. 

(చదవండి: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలి: శ్రద్ధా తండ్రి)

మరిన్ని వార్తలు