మాస్క్‌ లేదని పోలీసులు శిక్షిస్తే బాల్య స్మృతుల్లోకి..

31 Mar, 2021 15:40 IST|Sakshi

ముంబై: మళ్లీ ముదనష్టపు మహమ్మారి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తోంది. అయినా కూడా ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలీస్‌ శాఖ కరోనా జాగ్రత్తలు తీసుకునేలా పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మాస్క్‌లు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. అలా మాస్క్‌ లేదని కనిపించిన కొందరికి ముంబై పోలీసులు ‘కప్ప నడక’ శిక్ష విధించారు. ముంబైలోని సముద్రపు ఒడ్డున మాస్క్‌ లేకుండా వెళ్తున్న యువతను గుర్తించిన పోలీసులు కప్ప మాదిరి కొన్నిసార్లు గెంతాలని చెప్పారు. దీంతో ఆ యువత మాస్క్‌ ధరించకపోవడంతో కప్ప నడక చేశారు. 

అయితే ఈ ఘటన పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ సంస్థ యజమాని ఆనంద్‌ మహేంద్ర కంటపడింది. వామ్మో అనుకున్నారు. తన జ్ఞాపకాల నిధిని ఈ ఘటన గుర్తు చేసిందని ట్వీట్‌ చేశారు. తాను చిన్నప్పుడు పాఠశాలలో ఇలాంటి కుప్పి గంతులు శిక్షగా వేశానని గుర్తు చేసుకున్నారు. ఇది నవ్వు తెప్పించేదే కానీ.. శారీరక శ్రమ అని పేర్కొన్నారు. ఇకపై తాను తప్పనిసరిగా మాస్క్‌ ధరిస్తానని ఆనంద్‌ మహేంద్ర ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా పోలీసులు వేసిన శిక్ష ఆనంద్‌ మహేంద్ర దృష్టికి రావడం.. ఆయన బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
 

మరిన్ని వార్తలు