ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!

2 Nov, 2020 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట అనేది అంతర్జాతీయ భాష. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ఆస్వాదించగలరు’ అనే నానుడి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పాట లేదా సంగీతం మిజోరమ్‌ ప్రజలకు మాత్రం మాతృభాష. అదే మాతృభూమి భారత్‌ గురించి ప్రముఖ సంగీతకారుడు ఏఆర్‌ రెహమాన్‌ సమకూర్చిన ‘మా తుజే సలామ్‌’ పాటతో మిజోరమ్‌కు చెందిన నాలుగేళ్ల పాప ఈస్తర్‌ హ్నామ్తే ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. ఆమె పాడిన పాట వీడియోను ఇప్పటికే సోషల్‌ మీడియాలో పది లక్షల మందికి పైగా వీక్షించారు. దాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాప పాటను ‘అద్భతం’ అంటూ ప్రశంసించకుండా ఉండలేక పోయారు. 
(చదవండి : నాలుగేళ్ల చిన్నారిపై మోదీ ప్రశంసలు)

మిజోరమ్‌లోని లుంగ్లీ ప్రాంతానికి చెందిన ఆ పాప ఇదొక్కటే పాడలేదు. ఇంతకుముందు ఆ పాప పాడిన ‘వన్‌ డే ఎట్‌ ఏ టైమ్‌’, కా ఫాక్‌ హాంగ్, ఖాపూ మావీ అన్న పాటలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. మిగతా పాటలన్నీ ఒక ఎత్తయితే ‘మా తుజే సలాం’ అనే పాటను ఆ పాప పాడటం, ఆమెతోని ఉద్దేశపూర్వకంగానే ఆ పాటను పాడించడం ఓ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ‘మే భారతీయులం, భారతీయులంతా మా సోదర, సోదరీమణులు’ అని మిజోరం ప్రజల తరఫున ఆ పాప బలంగా ఓ సందేశాన్ని ఇచ్చింది. 

‘దేశంలోనే అత్యంత ఆనందకర రాష్ట్రం’ అన్న ప్రశంసలు అందుకున్న మిజోరమ్‌ ప్రజలను మాత్రం భారతీయులు పర జాతిగానే చూశారు. ‘టిబెటో–బర్మన్‌’ జాతికి చెందిన మిజోలను చూస్తే ఉత్తర, దక్షిణాది ప్రజలకు విదేశీయులుగా కనిపిస్తారు. ‘మా తుజే సలాం’ పాటను పాడిన ఈస్తర్‌ను తీసుకొని వారి తల్లిదండ్రులు భారత్‌లో తిరిగితే చైనా లేదా నేపాల్‌కు చెందిన వారని పొరపాటు పడతారు. అలా చూడడం వల్లనే మిజోలు 1966లో భారత్‌ నుంచి విడిపోయేందుకు ఆయుధాలు పట్టారు. ‘మిజో నేషనల్‌ ఫ్రంట్‌’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. భారత వైమానిక దళం ఆ తిరుగుబాటును కఠినంగా అణచివేసింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్లపాటు మిజోలు అష్టకష్టాలు అనుభవించారు. అందుకని మిజోలు తమ ప్రాంతాన్ని స్థానిక భాషలో ‘రాంభూయి (కల్లోల ప్రాంతం)’ అని వ్యవహరించేవారు. 

1986, జూన్‌ 30వ తేదీన మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్యన శాంతి ఒప్పందం కుదిరాకా అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు పొరుగునున్న అస్సాంతో సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ‘మా తుజే సలాం’ పాటను అంత హృద్యంగా పాడినందుకు ప్రజలంతా ఆ పాపకు సలాం చేయాల్సిందే. అక్షరాస్యతలో రెండో స్థానంలో ఉన్న మిజోలను భారత ప్రభుత్వం షెడ్యూల్‌ తెగలుగా గుర్తించినప్పటికీ వారికి జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదన్నది వాస్తవం. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు