అయోధ్య: ముస్లిం భ‌క్తుడి 800 కి.మీ. పాద‌యాత్ర

27 Jul, 2020 17:00 IST|Sakshi

అయోధ్య‌కు మ‌ట్టి తీసుకెళ్తున్న ముస్లిం భ‌క్తుడు

అయోధ్య‌: మ‌హ్మ‌ద్ ఫైజ్ ఖాన్‌.. పేరు రీత్యా ముస్లిం, కానీ అత‌ను శ్రీరామచంద్రుడి భ‌క్తుడు.. అయోధ్య‌లో రామమందిరం నిర్మాణం భూమి పూజ‌ను క‌ళ్లారా వీక్షించేందుకు వంద‌ల కిలోమీటర్లు కాలిన‌డ‌క‌న‌ ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాడు. ఇత‌ను రాముడి త‌ల్లి కౌస‌ల్యాదేవి జ‌న్మ‌స్థానంగా చెప్పుకుంటున్న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చంద్‌ఖురి గ్రామవాసి. ఆయ‌న‌కు హిందూ దేవుళ్లంటే అమిత‌మైన భ‌క్తిగౌర‌వాలు. ఎంతోమంది దేవుళ్ల‌ను స్మ‌రించుకుంటూ ప‌రవ‌శించిపోతాడు. ఎన్నో ఏళ్ల నుంచి క‌ల గంటున్న అయోధ్య రామ‌మందిరానికి పునాదులు ప‌డుతుండ‌టంతో భూమి పూజ‌కు వెళ్లేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరాడు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అనుప్పుర్‌కు చేరుకున్నాడు. (ఆగస్టులో రామాలయం పనులు)

ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. "ఇలా ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం నాకు తొలిసారేం కాదు. 1500 కి.మీ న‌డిచి  ఎన్నో గుళ్లు, ఆశ్ర‌మాల్లో బ‌స చేశాను. వీటితో పోలిస్తే ఈ ప్ర‌యాణం కేవ‌లం 800 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క‌రూ నాకు వ్య‌తిరేకంగా ఒక్క మాట మాట్లాడ‌లేదు. నేను ముస్లింనే.. కానీ, మా పూర్వీకులు హిందువులు. పాకిస్తాన్ జాతీయ క‌వి అల్లామా ఇక్బాల్.. రాముడిని భారత దేశానికే దేవునిగా పేర్కొన్నారు. అందుకే నా భ‌క్తి కొద్దీ కౌశ‌ల్యా జ‌న్మ‌స్థ‌ల‌మైన‌ చంద్‌ఖురి నుంచి అయోధ్య‌కు మ‌ట్టి తీసుకెళ్తున్నాను" అని తెలిపారు. కాగా అయోధ్య‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న రామ‌మందిర నిర్మాణానికి వ‌చ్చే నెల 5న‌ భూమి పూజ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 200 మంది హాజ‌రు కానున్నారు. (రామాల‌యం పునాది, క‌రోనా అంతానికి నాంది)

మరిన్ని వార్తలు