మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం

15 Dec, 2021 05:48 IST|Sakshi

మిస్‌ యూనివర్స్‌–2021 హర్నాజ్‌ సంధు

న్యూఢిల్లీ: తోటి మహిళలు ఆరోగ్యం, పరిశుభ్రతపై తమకున్న ఆందోళనలను స్వేచ్ఛగా బయటకు వెళ్లడించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే తన ధ్యేయమని మిస్‌ యూనివర్స్‌–2021 కిరీటధారి హర్నాజ్‌ సంధు(21) చెప్పారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తోపాటు రుతుక్రమ సమయంతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తన తల్లి, గైనకాలజిస్ట్‌ రవీందర్‌ కౌర్‌ సంధుయే తనకు ఆదర్శమన్నారు.

‘మహిళలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పుకోగలగాలి. మా వర్గీయుల్లో చాలామంది మహిళలు ఇప్పటికీ తమ శరీరం, ఆరోగ్యం గురించి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి అంశాలపై వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను కూడా నయం చేయవచ్చు’అని ఆమె చెప్పారు. పలు పంజాబీ సినిమాల్లో నటించిన హర్నాజ్‌ సంధు..బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రతిష్టాత్మక మిస్‌ యూనివర్స్‌–2021గా తన ఎంపిక దేశానికే వేడుక వంటిదన్నారు. సాధ్యమైనంత త్వరలో స్వదేశం వచ్చి విజయోత్సవం జరుపుకునేందుకు, తన తల్లిని కౌగలించుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె ఇజ్రాయెల్‌లోని ఐలాత్‌ నుంచి ఫోన్‌ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్‌ యూనివర్స్‌ను సొంతం చేసుకున్న మూడో భారతీయ యువతిగా హర్నాజ్‌ సోమవారం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ నుంచి ఆమె నేరుగా న్యూయార్క్‌ వెళతారు. అక్కడ ఆమె మిస్‌ యూనివర్స్‌ సంస్థతోపాటు పలు సంస్థలకు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు