తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు

12 Jan, 2021 20:58 IST|Sakshi

చెన్నై: రావడం లేటవ్వచ్చేమో కానీ, రావడం పక్కా అన్నట్లుగా జనీకాంత్‌ 2017 డిసెంబర్‌ 31వ తేదీన అభిమాన జనసందోహం మధ్య రాజకీయాల్లో తన ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన అభిమానులు మూడేళ్లుగా ఆయన రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఈ క్రమంలో రజనీకాంత్‌ డిసెంబర్‌ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన అని ప్రకటించారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ వీలు కాదు అని వ్యాఖ్యానించారు. కానీ అంతలోనే ఆయన అన్నాత్తే షూటింగ్‌ సమయంలో అనారోగ్యం పాలవడం, ఆ వెంటనే పార్టీ పెట్టడం లేదని గత నెల 29న ప్రకటించడం జరిగిపోయింది. దీంతో మా ఆశల మీద నీళ్లు చల్లారని, రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తలైవా‌ వీరాభిమాని రాఘవ లారెన్స్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులందరికీ క్షమాపణలు చెప్తూ‌ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ రాసుకొచ్చారు. (చదవకండి: నొప్పించకండి ప్లీజ్‌: ఫ్యాన్స్‌కు రజనీ లేఖ)

"తలైవార్‌ నిర్ణయం వెనక్కు తీసుకోమని చెప్పమని ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు. వల్లువార్‌ కొట్టంలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనమని అభ్యర్థిస్తున్నారు. దర్శకుడు సాయిరమణి ద్వారా ఎన్నో వాయిస్‌ నోట్లు కూడా విన్నాను. వీటన్నింటి వల్లే ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయం మీలాగే నన్ను కూడా బాధిస్తోంది. ఆయన వేరే ఇతర ఏ కారణాలు చెప్పినా రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్‌ చేసేవాళ్లం. కానీ ఆయన చెప్పిన ముఖ్య కారణం ఆరోగ్యం. అయినా సరే పాలిటిక్స్‌లోకి రావాల్సిందేనని మంకుపట్టి ఆయనను రప్పించామనుకోండి.. రేపు పొద్దున ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే జీవితాంతం మనం కుంగిపోవాల్సిందే. అయినా ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా ఎప్పటికీ నాకు గురువే. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నాకు తలైవా ఆరోగ్య పరిస్థితేంటో బాగా తెలుసు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని మనమందరం కోరుకుందాం. గురువే శరణం.." అంటూ లారెన్స్ లేఖను పంచుకున్నారు. (చదవకండి: ‘నా తమ్ముడు ఎన్నటికీ సీఎం కాలేడు’)

మరిన్ని వార్తలు