‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’

4 May, 2021 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసుపత్రిలో బెడ్స్‌, ఆక్సిజన్‌ కొరతతో ఎంతో మంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో చాలా కుటుంబాలు త‌మ కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సరైన వైద్య చికిత్స అందకపోవడంతోనే తన భర్త, తల్లి మరణించారని  మాజీ దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అర్చన దత్తా  ఆరోపించారు. ఏప్రిల్‌ 27న మాల్వియా నగర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్చన తన భర్త, తల్లిని కోల్పోయారు. ఈ విషాదాలు కేవలం గంట వ్యవధిలో చోటుచేసుకోవడం మరింత దారుణం. వీరు చనిపోయిన తర్వాత ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు.

త‌న త‌ల్లి, భ‌ర్త‌ను ఆసుపత్రిలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫ‌లితం లేక‌పోయింద‌ని, ఒక గంట వ్యవధిలోనే త‌న‌ తల్లి, భర్తను కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘నా లాగా చాలా మంది తమ కుటుంబానికి ఏం జరగకూడదని అనుకుంటారు.. కానీ అదే జరిగింది. నా తల్లి, భర్త ఇద్దరూ చికిత్స అందకుండానే మరణించారు. ఢిల్లీలోని ఎన్నో ప్రముఖ ఆసుపత్రులను సందర్శించానా చేర్చుకోలేదు. వారు మృతి చెందాక కరోనా పాజిటివ్‌ అని తేలింది.’ అని ట్వీట్‌ చేశారు. ఇక ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రతినిధిగా ఎంఎస్ దత్తా ఉన్నారు.

కాగా అర్చన భర్త ఎఆర్ దత్తా రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసి విరమణ పొందిన ఏఆర్‌ దత్తా(68). ఆమె తల్లి బనీ ముఖర్జీ(88) ఇటీవల ఆరోగ్యం క్షీణించింది. అర్చన కుమారుడు అభిషేక్‌ వారిద్దరిని దక్షిణ డిల్లీలోని ఓ ప్రముఖ ఆసుతప్రికి తరలించాడు. అయితే అక్కడ వారు చేర్చుకోలేదు. ఇలా పలు ఆసుపత్రుల్లో ఏవ్వరూ స్పందించలేదు. చివరికి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడి గంటల వ్యవధిలోనే వారిద్దరు మరణించారు. ఇక ప్రస్తుతం తమ కుటుంబంలో అభిషేక్‌ మినహా అందరూ కోవిడ్‌ బారిన పడినట్లు అర్చన దత్తా వెల్లడించారు. తన మేనకోడలి పరిస్థితి క్షీణిస్తోందని.. ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రులు తిరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: 
‘మరో నాలుగు రోజులే, సీఎం యోగీకి మరణం తప్పదు’

జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు