గ్రంథాలయానికి నిప్పు: కాలి బూడిదైన 11వేల పుస్తకాలు

11 Apr, 2021 09:18 IST|Sakshi
నామరూపాల్లేకుండా కాలిపోయిన లైబ్రరీ, తన గ్రంథాలయం ముందు సయ్యద్‌ (ఫైల్‌)

సరస్వతీ నిలయానికి నిప్పు

సాక్షి, మైసూరు: ఆయనొక ముస్లిం. నిరక్షరాస్యుడైనప్పటికీ చదువంటే అమితమైన మక్కువ. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ప్రైవేట్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నిత్యం ఎంతో మంది పుస్తకాలు చదివేవారు. ఇది చూసి ఓర్వలేని కొందరు నిప్పు పెట్టడంతో నిన్నటివరకు కళకళలాడిన గ్రంథాలయం బూడిద కుప్పగా మారింది. 11 వేల పుస్తకాలు మంటల్లో ఆహుతయ్యాయి. కర్ణాటకలో మైసూరు నగరంలోని రాజీవ్‌నగరలోని 2వ స్టేజిలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

సయ్యద్‌ అనే భాషాభిమాని కష్టార్జితంతో ఒక షెడ్డునే గ్రంథాలయంగా మలిచాడు. వృత్తిరీత్యా చిన్నస్థాయి ప్లంబర్‌ అయిన ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. కన్నడ భాష అంటే మరీ అధికం. చాలా ఏళ్ల కిందట వైవిధ్య పుస్తకాలతో లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. నిత్యం ఎంతోమంది వచ్చి పుస్తకాలు చదివి వెళ్లేవారు. కానీ శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ లైబ్రరీకి నిప్పు పెట్టారు. పుస్తకాలు, షెడ్డు మొత్తం మంటల్లో కాలిపోయాయి. ఫైర్‌ సిబ్బంది వచ్చేటప్పటికీ ఏమీ మిగలలేదు.  కాలిపోయిన పుస్తకాలను చూసి సయ్యద్‌ బోరును విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: నడిచే పుస్తకాలయాలు

బెంగాల్‌ ఎన్నికలు రక్తసిక్తం

మరిన్ని వార్తలు