Loud Sound Heard Near Bengaluru: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’

26 Nov, 2021 17:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు సమీప ప్రాంతంలో భారీ వింత శబ్దం

భయాందోళనకు గురైన ప్రజలు

బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్‌ బెంగళూరు సమీప ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ శబ్దం వినిపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ శబ్దం ముఖ్యంగా బిదాది ప్రాంతం నుంచి వెలువడినట్లు.. బాంబు పేలినప్పుడు ఎంత భారీ శబ్దం వినిపిస్తోందో.. అలాంటి సౌండే వినిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బారీ శబ్దం వల్ల జనాలు తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురయ్యారు. భూకంపం వచ్చిందా.. లేక ఎక్కడైనా భారీ పేలుడు సంభవించిందా అంటూ నెటిజనులు సోషల్‌ మీడియాలో ప్రశ్నల మోత మోగించారు. 

ఇక ఈ వింత శబ్దంపై కర్ణాటక పోలీసులు స్పందించారు. బెంగళూరు, దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు సంభవించలేదని తెలిపారు. అలానే రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం భారీ శబ్దం వినిపించిందని పేర్కొంటున్న ప్రాంతాల్లో ఎలాంటి భూకంపం చోటు చేసుకోలేదని.. అలానే భూమి పొరల్లో కూడా ఎక్కడా.. ఎలాంటి మార్పులు జరగలేదని తెలిపారు. 
(చదవండి: కర్ణాటక: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..)

‘‘అంతేకాక భారీ శబ్దం వినిపించింది అంటున్న సమయంలో ఏదైనా భూకంప సంకేతాలు వెలువడ్డాయా లేదా అని తెలుసుకోవడం కోసం భూకంప పరిశీలనల కేంద్రం డేటాను విశ్లేషించడం జరగింది. సీస్మోగ్రాఫ్‌లు స్థానికంగా ఎలాంటి ప్రకంపనలు, భూకంపం సంకేతాలను చూపించలేదు’’ అని అధికారులు తెలిపారు.  ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మరీ ఈ శబ్దం ఎక్కడ నుంచి వెలువడింది.. దానికి కారణం ఏంటనే దాని గురించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
(చదవండి: భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ)

ఇక 2021, జూలై 2న బెంగళూరులో ఇదే తరహా శబ్దం వినిపించింది. బెంగళూరులో జూలై 2న కూడా ఇదే విధమైన ధ్వని వినిపించింది, ఇది ధ్వని వేగం కంటే వేగంగా వెళ్లినప్పుడు జెట్ విమానం నుంచి వెలువడే సోనిక్ బూమ్ అని భావించారు. బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌  విమానాలను పరీక్షించే సమయంలో ఈ శబ్దం వెలువడినట్లు భావించారు. అయితే భారత వైమానిక దళం సోనిక్‌ బూమ్‌ వాదనను ఖండించింది. మరోసారి ఇదే తరహా శబ్దం వినిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

చదవండి: పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్‌ చూసినట్లే!


 

మరిన్ని వార్తలు