దళితులకు హెయిర్‌ కట్‌ : ఆత్మహత్యే శరణ‍్యం

20 Nov, 2020 11:11 IST|Sakshi

 కర్నాటక​లో అమానుష ఘటన

దళితులకు హెయిర్‌ కట్‌ చేసినందుకు సంఘ బహిష్కరణ

50 వేల రూపాయల జరిమానా 

సాక్షి, బెంగళూరు: కరోనా  వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా పలు వ్యాపారాలు, చిన్న, చిన్న దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతోపాటు అనేక వృత్తి కార్మికులు కూడా ఉపాధిలేక సంక్షోభంలోకి కూరుకుపోయారు. అయితే ఇపుడిపుడే సాధారణ పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక బార్బర్‌షాపు యజమాని పట్ల గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఎస్‌సీ, ఎస్‌టీ సామాజివర్గాలకు హెయిర్‌ కట్‌ చేశారన్న అక్కసుతో మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని  బార్బర్‌  కుటుంబాన్ని బాయ్‌కాట్‌ చేసిన ఉదంతం కర్నాటకలో చోటుచేసుకుంది.

హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున​ శెట్టి కుటుంబం కటింగ్‌ సెలూన్‌ నడుపుకుంటోంది. చెప్పినా వినకుండా ఎస్‌టీ, ఎస్సీ సభ్యులకు జుట్టు కత్తిరించారంటూ కొందరు కుల దురహంకారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామంటూ బార్బర్‌ మాల్లికార్జున​ ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాపును సందర్శించిన చన్నా నాయక్‌ తదితరులు దళితులకు ఎ‍క్కువ చార్జ్‌ వసూలు చేయాలని గతంలో ఆదేశించారని ఆరోపించారు. దీనికి తాము అంగీకరించకపోవడంతో తమ కుమారుడిని కొట్టి, బెదిరించి మరీ అతడినుంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపారు. దళితుడికి హెయిర్‌ కట్‌ చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తమ​కు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు.

మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం శోచనీయమని మండిపడుతున్నాయి. ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష,  సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు