నేత్రపర్వంగా మైసూరులో దసరా  

25 Oct, 2023 13:59 IST|Sakshi

మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్‌ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు.

మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్‌ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది.  10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు  విదేశాల నుంచీ జనం తరలివచ్చారు.

మరిన్ని వార్తలు