Nag Panchami 2021: సృష్టికర్తే శపించిన వేళ! నాగ పంచమి విశిష్టత.. సర్ప పూజ ఎలా చేస్తారు?

13 Aug, 2021 12:03 IST|Sakshi

‘ఓం సర్పరాజాయ విద్మహే
నాగరాజాయ ధీమహి
తన్నో అనంత ప్రచోదయాత్’

ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా పాటిస్తారు. ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ పూజలు చేస్తారు. నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా చేసుకునే పూజే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజుగా దీనికి ప్రశస్తి. ‘‘నాగుల చవితి’’ రోజులాగే.. ‘‘నాగ పంచమి” నాడు కూడా నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ ఉండవని, చేపట్టిన కార్యాలు సవ్యంగా నెరవేరుతాయని, అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. 

భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ‘సర్పం’ దైవ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు. పరమేశ్వరుడికి కర్ణాభరణమ్. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు కూడా. 

వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం దేశమంతా నడుస్తోంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధముగా చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి, శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగ దేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. 

పురాణ కథ.. 
కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు.. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , నవనాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు.. జన్మిస్తారు. వీళ్లు కనబడిన వారినల్లా కాటు వేస్తూ ప్రాణాలను హరిస్తుంటారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తారు. దీంతో బ్రహ్మ ఆగ్రహించి.. ‘తల్లి చేతిలో శాపానికి గురై వాళ్లంతా నాశనం అవుతార’ని శపిస్తాడు. అప్పుడు ఆ అన్నదమ్ములంతా విధాత ముందు తలవంచుతారు. ‘‘సృష్టించిన మీరే.. మమ్మల్ని నాశనం కావాలని శపించడం న్యాయమా?’’ అని వేడుకుంటారు. దీంతో శాంతించిన బ్రహ్మ.. నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకుని తిరగండి . దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు.. మీమీ స్థాన గౌరవాలను కాపాడుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారిపోండి. మీ నాగులంతా ఇక అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి’’ అని శాసిస్తాడు. దీంతో ఆ నాగ సంతతి అన్నదమ్ములంతా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహిస్తారు. అది చూసి దేవతలంతా నాగులను ప్రశంసించగా.. భూలోక వాసులంతా పూజలు చేశారు. అలా దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగ పంచమి నాడు నాగులను పూజించడం జనాలకు పరిపాటిగా మారింది. 

ఎలా చేస్తారంటే..

నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నెయ్యితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి. 

నాగ పంచమి వ్రత కథ 
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . ఆయన విని “అమ్మా ” నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , ఇపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి. 

ఆంతర్యం ఇదే..
ఇక ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని, పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాశము వారిది అని అనుకోవాలి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది.

మరో అంశం ఏమిటంటే.. సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది.  కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుందని విశ్వసిస్తారు. 

పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి .
విషాణి తస్య నశ్యంతి
నటాం హింసంతి పన్నగాః
న తేషా సర్పతో వీరభయం
భవతి కుత్ర చిత్।। 
ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే, నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం .
కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తనం కలినాశనం।।

గరుడ పంచమి
నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్‌ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు