Viral Video: ‘మయన్మార్‌లో తింటే.. భారత్‌లో పడుకుంటారు’

12 Jan, 2023 18:57 IST|Sakshi

నాగాలాండ్‌ మంత్రి టెన్‌జెన్‌ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఇది భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్‌లోని మోన్‌జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్‌ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్‌, మయన్మార్‌ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్‌ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 

1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా  గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్‌పై బర్మీస్‌ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్‌పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్‌ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్‌ తెగ అతి పెద్దది. 

కొన్యాక్‌ తెగకు ఆంగ్‌ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్‌, మయన్మార్‌ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్‌కు, మరికొన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్‌ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్‌, భారత్‌  సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్‌లో ఉంటే మిగిలిన సగం మయన్మార్‌కు చెందుతుంది.

అంటే ఆంగ్‌ తమ కిచెన్‌ నుంచి బెడ్‌ రూమ్‌లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.  ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్‌ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్‌ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్‌ మంత్రి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్‌రూం).. మయన్మార్‌లో తింటారు(కిచెన్‌) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు