మరోసారి వివాదాల్లో నాగేశ్వరరావు

30 Jul, 2020 21:39 IST|Sakshi
మన్నెం నాగేశ్వరరావు (ఫైల్‌)

న్యూఢిల్లీ: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక మాజీ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. అత్యంత దారుణమైన రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన రావుపై ఢిల్లీ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. (సీబీఐ అదనపు డైరెక్టర్‌ తొలగింపు..!)


హిందువుల అణచివేత
ముస్లింలకు అను​కూలంగా భారత చరిత్రను వక్రీకరించారనే అర్థం వచ్చేలా నాగేశ్వరరావు ట్విటర్‌లో పోస్ట్‌లు పెట్టారు. భారత నాగరికతను కుట్ర ప్రకారం ఇస్లామీకరణ(అబ్రహమైజేషన్‌) చేశారని ఆయన ఆరోపించారు. హిందువులను అన్ని రకాలుగా అణచివేశారని పలు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష అనుకూల విద్యావేత్తలను నెత్తిన పెట్టుకుని, హిందూ అనుకూల జాతీయవాద పండితులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. 1947-77 మధ్య 30 ఏళ్లలో దేశానికి విద్యాశాఖ మంత్రులుగా 20 ఏ‍ళ్లు ముస్లింలు,  మిగతా పదేళ్లు వామపక్షవాదులు ఉన్నారని.. హిందువుల పతనానికి ఇది మొదటి దశగా అని వర్ణించారు. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ 11 ఏళ్ల పాటు(1947-58) విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విద్యతో పాటు మీడియా, వినోద రంగాలను ఇస్లామీకరణ చేశారని.. హిందువుల ఉనికి ముప్పు వాటిల్లేలా కుట్రలు చేశారని నాగేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు.

రావుపై చర్యలు తీసుకోండి
నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బృందా కారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం సమాజానికి చెందిన ఇతర ప్రముఖ విద్యావేత్తలను అవమానించి రెండు వర్గాల మధ్య శత్రుత్వ భావనలను ప్రేరేపించడానికి నాగేశ్వరరావు ప్రయత్నించారని కారత్‌ తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లఘించి బహిరంగంగా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాగేశ్వరరావు వ్యాఖ్యలను పలువురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు తప్పుబట్టారు. 

వివాదాలకు చిరునామా
మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నాగేశ్వరరావుకు కొత్త కాదని ఆయన గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తొంభై దశకం చివరలో ఒడిశాలోని బెర్హంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీలో అధికారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని విషపూరిత మత ప్రకటనలు చేశారు. రెండు అధికారిక విచారణలు ఆయనను దోషిగా గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాయి. 2018లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రావును నియమించినప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్‌ సర్వీసెస్‌, సివిల్‌ డిఫెన్స్‌, హోమ్‌గార్డ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు