కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు

23 Sep, 2023 12:56 IST|Sakshi

కుండపోత వర్షంతో నీటమునిగిన నాగ్‌పూర్

ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం

రాష్ట్రానికి కేంద్ర బలగాల రాక

నాగ్‌పూర్‌: కుండపోత వర్షంతో నాగ్‌పూర్ నీటమునిగింది. శుక్రవారం ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 

'అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నాగ్‌పూర్‌లోని అంబజారీ సరస్సు పొంగిపొర్లింది. సమీప ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. 

వర్షంలో నీటమునిగిన ప్రాంతాలకు సహాయక బృందాలను ప్రభుత్వం పంపింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను అప్రమత్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు నాగ్‌పూర్‌ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్లు కొట్టుకుపోయాయి. నాలాలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న డెంగీ

మరిన్ని వార్తలు