నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

11 Mar, 2021 14:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మార్చి 15-21 వరకు లాక్‌డౌన్‌

అత్యవసర సేవలు మినహా అన్ని బంద్‌

ముంబై: కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మరో సారి పంజా విసురుతోంది. నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15-21 వరకు నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 

అత్యవసర సేవలు అయిన పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణ వస్తువులు లభించే దుకాణాలను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మార్చి 15 నుంచి నాగపూర్‌లోని అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని.. ప్రజలందరూ సహకరించాలని పోలీసు ఉన్నతాధికారి కోరారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘రానున్న రోజుల్లో మరి కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నాం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాము’’ అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని జలగావ్‌ జిల్లాలో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. మార్చి 8 నుంచి జలగావ్‌లో రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. 

ఇక తాజాగా మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే అత్యధికంగా 13,659 కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచే 60 శాతం కేసులుండటం గమనార్హం. నాగపూర్‌లో కూడా 1,710 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధేంచేందుకు సిద్ధమయ్యింది. 

చదవండి:
కరోనా : మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మహీంద్రా షాక్‌
వారియర్స్‌కు వ్యాక్సిన్‌; చాలా బాధగా ఉంది..

మరిన్ని వార్తలు