పబ్జీ బ్యాన్‌: నాగ్‌పూర్‌ పోలీసుల ఫన్నీ ట్వీట్‌

3 Sep, 2020 17:08 IST|Sakshi

ముంబై : యువతలో ఎక్కువగా ఆదరణ పొందిన ప్రమఖ గేమింగ్‌ యాప్‌ పబ్‌జీపై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యువతను అత్యధికంగా ప్రభావితం చేసిన ఆన్‌లైన్‌ గేమ్‌ కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది, భారత్‌లో 12 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కాలక్రమంలో ఈ గేమ్‌ వ్యసనంలా మారడంతో దీనికి విద్యార్థులు, యువత బానిసలయ్యారు. ప్రస్తుతం ఇండియా పబ్జీని బ్యాన్‌ చేయడంతో ఎంతోమంది యువకుల తల్లదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పబ్జీ ఆటగాళ్లు మాత్రం సతమతమవుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఈ గేమింగ్‌పై అనేక మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి.(పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు)

ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌ పోలీసులు పబ్జీ గేమ్‌ను ఉదాహరణగా తీసుకుంటూ కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. ‘ఇకపై పోచింకిని సందర్శించలేరు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌ అందరికి అర్థం కాకపోయినా పబ్జీ ఆడే ఆటగాళ్లకు మాత్రం తప్పకుండా అర్థం అవుతోంది. పోచింకి అనేది ఆటలో ఓ మ్యాప్‌. దీనిని అనుసరించే ఆడాల్సి ఉంటుంది. ఇక బుధవారం షేర్‌ చేసిన ఈ ట్వీట్‌ అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు 2 వేల లైకులు రాగా.. అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. పోలీసుల సృజనాత్మకతను నెటిజన్లు అభినందిస్తున్నారు. మరి కొందరు పబ్జీ బ్యాన్‌తో విచారం వ్యక్తం చేస్తున్నారు. (పబ్జీని బ్యాన్‌ చేసినా భారత్‌లో ఆడొచ్చు!)

మరిన్ని వార్తలు