మాస్క్‌ ధరించి.. టైగర్‌లా ఉండండి

29 Jul, 2020 17:05 IST|Sakshi

నాగ్‌పూర్‌ :  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల సంక్షేమం కోసం పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్‌ గురించి ఎప్పటికప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ ఆకారాన్ని పోలిన హెల్మెట్లను ధరించి కొందరు పోలీసులు అవగాహన కల్పిస్తుంటే మరికొందరు సోషల్‌మీడియా వేదికగా పలు మీమ్స్‌ చేశారు. తాజాగా నాగ్‌పూర్‌ పోలీసులు తమ అధికారిక ట్విటర్‌ ఖాతా వేదికగా ఓ పులి ఫోటోతో మాస్కులు ధరించడం పట్ల  ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. (చదవండి: వైరల్‌: పెద్దపులినే బురిడి కొట్టించిన బాతు )

వరల్డ్‌ టైగర్‌ డే సందర్భంగా  ఓ పులి తన కాలిని ముఖానికి అడ్డంగా పెట్టుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ముక్కు కిందకు మాస్క్‌ ధరించిన వ్యక్తులను చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది’క్యాప్షన్‌ పెట్టారు. మరో ట్వీట్‌లో ‘మాస్క్‌ ధరించి పులిలా ఉండండి’అని చెప్పుకొచ్చారు. చాలా మంది మాస్కులు సరిగా ధరించకపోవడంతో అవగాహన కోసం పోలీసులు ఈ ట్వీట్‌ చేశారు.

నాగ్‌పూర్‌ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్‌.. ముసిముసి నవ్వులు నవ్వించడమే కాకుండా ముసుగు ఎలా ధరించాలో కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ట్వీట్‌ కామెడీగానే ఉన్నా.. మంచి విషయం చెప్పారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘పులి అడవికి రాజు అయితే.. నాగ్‌పూర్‌ పోలీసులు సోషల్‌ మీడియాకు రాజులు’,‘మాస్కులు ఎలా ధరించకూడదో చెప్పినందుకు ధన్యవాదాలు’అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు