ప్రియాంక, రాహుల్‌ను కలుస్తా..

14 Nov, 2022 07:02 IST|Sakshi

భర్తతో కలిసి కుమార్తెను చూడాలని ఉంది నళిని వ్యాఖ్య  

సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి జనావాసంలోకి వచ్చిన నళిని ఆదివారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తమ విడుదల కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు చెప్పారు. అవకాశం ఇస్తే, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. 

సుప్రీంకోర్టు తీర్పుతో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు జీవితం నుంచి నళినితో పాటు ఇతర నిందితులకు విముక్తి కలిగిన విషయం తెలిసిందే. నళిని, రవిచంద్రన్‌ జైలు నుంచి విడుదలై ఇళ్లకు చేరుకున్నారు. అయితే నళిని భర్త మురుగన్, జయకుమార్, శాంతను, రాబర్డ్‌ శ్రీలంక వాసులు కావడంతో వీరిని మాత్రం తిరుచ్చిలోని ఈలం తమిళుల పునరావస కేంద్రంలో ఉంచారు. 30 ఏళ్లు జైలు పక్షిగా ఉండి, ప్రస్తుతం స్వేచ్ఛ లభించడంతో నళిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఆదివారం చెన్నైకు చేరుకున్న ఆమె ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, జైలులో తాను అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.  

ఎంతో ప్రేమ చూపించారు..
న్యాయవాదులు తన విడుదల కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేసుకున్నారు. అలాగే మాజీ సీఎం పళణి స్వామి, ప్రస్తుత సీఎం స్టాలిన్‌ తమ విడుదల వ్యవహారంలో ప్రత్యేక చొరవ చూపించారని పేర్కొన్నారు. అంతే కాదు, యావత్‌ తమిళ ప్రజలందరూ తమ విడుదల కోసం ఎదురు చూశారని, తమ మీద ఎంతో ప్రేమను చూపించారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజలే కాకుండా  నాయకులు కూడా తనకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. అందుకే  అందరినీ కలిసి పేరు పేరును ధన్యవాదులు తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 

భారతీయులమే..
భర్త మురుగన్‌తో తన వివాహం  ఇక్కడ రిజిస్ట్రర్‌ అయ్యిందని, పైగా తాను భారతీయురాలు అని నళిని వెల్లడించింది. తామిద్దరం కలిసి జీవించే అవకాశం కోసం సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. అవకాశం ఇచ్చి అత్యవసర వీసా, పాస్‌పోర్టు సమకూర్చిన పక్షంలో ఆగమేఘాలపై లండన్‌లో ఉన్న కుమార్తెను మురుగన్‌తో కలిసి వెళ్లి చూడాలని ఉందని పేర్కొంది. తన కుమార్తె లండన్‌లో గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్‌ అని, ఆమెతో తామిద్దరం కలిసి ఉండేందుకు సైతం అవకాశం ఉందన్నారు. శ్రీలంకకు  భర్తతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని,  వెళ్లాల్సిన అవసరం కూడా తన లేదన్నారు. జైలులో ఉన్న సమయంలో ఎన్నో కలలు కన్నానని, అవన్నీ ప్రస్తుతం నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

ప్రియాంక ఏడ్చేశారు.. 
ప్రియాంక గాంధీ గతంలో తనను జైలులో కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో ఆమె గట్టిగా ఏడ్చేశారని తెలిపారు. తండ్రిని తలచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి ఆమె లోనయ్యారని పేర్కొన్నారు. అవకాశం ఇస్తే ప్రియాంకతో పాటు రాహుల్‌ గాంధీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఎప్పటికైనా జైలులో అష్టకష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత అమ్మ జయలలిత సమాధి, మిస్సెల్‌మన్‌ అబ్దుల్‌ కలాం సమాధులను సందర్శించి నివాళులర్పించాలని ఉందని తెలిపారు. తన భర్తను త్వరితగతిన ఈలం పునారవాస శిబిరం నుంచి బయటకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.  

మరిన్ని వార్తలు