e-commers: రంగంలోకి నందన్‌ నీలేకని

6 Jul, 2021 11:40 IST|Sakshi

ఐటీ దిగ్గజం నందన్‌ నీలేకనికి కీలక బాధ్యతలు

 ప్రభుత్వ ఓఎన్‌డీసీ సభ్యుడుగా నందన్‌ నీలేకని

తొమ్మిది మందితో కేంద్ర​ ప్యానెల్‌

సాక్షి, న్యూఢిల్లీ:  ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నందన్ నీలేకనికి మోదీ సర్కార్‌ కీలక బాధ‍్యతలను అప్పగించింది. డిజిటల్  మోనోపలీకి చెక్‌పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్‌లో నీలేకనిని సభ్యుడిగా చేర్చింది.  తద్వారా ఈకామర్స్‌ రంగంలో అక్రమాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లయ్‌ చెయిన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం,  మరిన్ని సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచుతుందని  భావిస్తున్నారు.

డిజిటల్‌ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ  తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నందన్‌ నీలేకనిని కూడా చేర్చడం విశేషం.  ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) పేరుతో ఏర్పటవుతున్న ఈ కమిటీ నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి (డీపీఐఐటీ)జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ), ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.  

ఐటీ దిగ్గజం నందన్‌ నీలేకనీతో పాటు, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసిఐ చీఫ్ ఆదిల్ జైనుల్‌ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేథి, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఈ కౌన్సిల్‌లో  సభ్యులుగా ఉంటారు.

కాగా నందన్‌ నీలేకని యుఐడీఏఐ చైర్మన్‌ గానూ, టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్,  జీఎస్‌టీ సహా ఐదు కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి  నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు