ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి అరెస్ట్‌కు రంగం సిద్ధం

24 Aug, 2021 13:33 IST|Sakshi
నారాయణ రాణే (ఫైల్ ఫోటో)

ముంబై: కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలతో మరోసారి శివసేన, బీజేపీల మధ్య యుద్ధం మొదలయ్యింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి.. నారాయణ రాణే కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. నారాయణ రాణే వ్యాఖ్యలపై శివసేన నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నాసిక్‌ పోలీసులు నారాయణ రాణేను అరెస్ట్‌ చేసేందుకు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో నారాయణ రాణే ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శివసేన యూత్‌ వింగ్‌ కార్యకర్తలు ముంబైలోని నారాయణ రాణే నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ, శివసేక కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రోడ్డు మీద బైటాయించి ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. (చదవండి: ‘మేం తిరిగి కొడితే...లేవడం కష్టం: బీజేపీకి ఉద్ధవ్‌ ఠాక్రే కౌంటర్‌)

వివాదం ఏంటంటే.. 
రాయ్‌గ‌ఢ్ జిల్లాలో సోమ‌వారం నారాయ‌ణ్ రాణే జ‌న్ ఆశీర్వాద్ యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దేశానికి ఎప్పుడు స్వాతంత్య్రం వచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్‌ ఠాక్రేను కొట్టాలన్నంత కోపం వచ్చిందన్నారు నారాయణ రాణే. ‘‘ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి దేశానికి స్వాతంత్య్రం ఎ‍ప్పుడు వచ్చిందో తెలియ‌క‌పోవ‌డం సిగ్గు చేటు. ప్ర‌సంగం సంద‌ర్భంగా ఠాక్రే ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో క‌నుక్కొని మ‌రీ చెప్పారు. ఒక‌వేళ నేను అక్క‌డే ఉండి ఉంటే.. ఠాక్రేను కొట్టేవాడిని’’ అంటూ నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్‌ )

ఈ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన తీవ్రంగా మండిపడింది. సోమ‌వారం రాత్రే నారాయణ రాణేపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న కొంక‌ణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో ఉండ‌టంతో రాణేను అరెస్ట్ చేయ‌డానికి నాసిక్ పోలీసులు అక్క‌డి వెళ్లారు. ఈ వివాదంపై నాసిక్ పోలీస్ క‌మిష‌న‌ర్ దీప‌క్ పాండే స్పందించారు. ‘‘ఇది చాలా తీవ్ర‌మైన అంశం. ఇప్ప‌టికే కేంద్ర మంత్రిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఓ బృందం వెళ్లింది. ఆయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ కోర్టులో హాజ‌రు ప‌రుస్తాం. కోర్టు నిర్ణ‌యం ప్ర‌కారం ముందుకు వెళ్తాం’’ అని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు