మోదీ బర్త్‌డే: 5 కోట్ల పోస్ట్‌కార్డులు.. థాంక్స్‌ పీఎం బ్యానర్‌లు

4 Sep, 2021 20:49 IST|Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 17న మోదీ పుట్టిన రోజు నాడు ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘‘సేవా, సమార్పణ్‌, అభియాన్‌’’ పేరిట 20 రోజుల పాటు మెగా ఈవెంట్‌ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు. 

మోదీ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్‌ సమయంలో ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసినందుకు, కోవిడ్‌ టీకా వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థ్యాంక్స్‌ పీఎం బ్యానర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాక బూత్‌ స్థాయి నుంచి మోదీని అభినందిస్తూ 5 కోట్ల పోస్ట్‌ కార్డులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్తలందరూ సమీప రేషన్‌ దుకాణాలకు వెళ్లి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో క్లిప్‌ రికార్డ్‌ చేసి దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని పార్టీ సూచించింది. (చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్‌)

ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గంగా నదిని శుభ్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 71 చోట్ల క్లీన్‌ గంగా పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంప్‌లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి వచ్చే అన్ని బహుమతులను వేలం (pmmementos.gov.in/#/) వేసి ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ కోవిడ్‌ నియమాలు పాటించాలని పార్టీ సూచించింది. 

చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్‌

మరిన్ని వార్తలు