పీఎం కేర్స్‌కు మోదీ రూ.2.25 లక్ష‌ల విరాళం

3 Sep, 2020 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే  రూ.3,076 కోట్లు వ‌చ్చిన‌ట్లు పీఎం కార్యాల‌య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రూ.2.25 ల‌క్ష‌ల‌తో ఈ నిధి ప్రారంభ‌మైంద‌ని, అయితే మొట్ట‌మొద‌ట‌గా ఈ విరాళ‌మిచ్చింది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనేన‌ని అధికారులు వెల్ల‌డించారు. తొలి కార్ప‌స్ ఫండ్‌గా రూ.2.25 ల‌క్ష‌లు ఆయ‌న త‌న స్వంత జేబులో నుంచి స‌మ‌కూర్చిన‌ట్లు తెలిపారు. కాగా‌ ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్‌) ఉండ‌గా మ‌ళ్లీ కొత్త‌గా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్న విష‌యం తెలిసిందే. పైగా పీఎం కేర్స్ ప‌ద్దుల‌ను కాగ్ కాకుండా ప్రైవేట్ ఆడిట‌ర్లు ప‌ర్య‌వేక్షించ‌డంపైనా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. దీనిపై కేంద్రం బ‌దులిస్తూ ఇది కేవ‌లం 'స్వ‌చ్ఛంద నిధి' అని స్ప‌ష్టం చేసింది. (చ‌ద‌వండి: పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపు అనవసరం )

మోదీ ఇచ్చిన విరాళాలివే...
ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రిగే కుంభ‌మేళాలో ప‌నిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి న‌రేంద్ర మోదీ గ‌తేడాది రూ.21 ల‌క్ష‌ల విరాళం అందించారు. 2018లో సియోల్ శాంతి పుర‌స్కారం అందుకున్న మోదీ.. దాని ద్వారా వ‌చ్చిన రూ.1.3 కోట్ల న‌గ‌దును తన‌వంతుగా గంగా ప్రక్షాళ‌న‌ కోసం అంద‌జేశారు. దీనితోపాటు ఆయ‌న తను పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి రూ.3.40 కోట్ల‌ను, గిఫ్టుల ద్వారా వ‌చ్చిన‌ రూ.8.5 కోట్ల‌ను కూడా న‌మామి గంగా మిష‌న్‌కు అంద‌జేశారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత ఆ రాష్ట్ర సిబ్బంది కుమార్తెల విద్య‌ కోసం రూ.21 ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. సీఎంగా ఉన్న‌ప్పుడు వ‌చ్చిన బ‌హుమ‌తుల‌ను వేలం వేయ‌గా వ‌చ్చిన రూ.89.96కోట్ల‌‌ను క‌న్యా కేల‌వాణి ఫండ్(ఆడ‌పిల్ల‌ల విద్య‌ను ప్రోత్స‌హించే నిధి) విరాళంగా ఇచ్చారు. (చ‌ద‌వండి: రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా)

మరిన్ని వార్తలు