నరేంద్ర మోదీ.. యూట్యూబ్‌ ఛానెల్‌లో అరుదైన ఘనత, గ్లోబల్‌ రికార్డు భారత ప్రధాని సొంతం!

2 Feb, 2022 11:44 IST|Sakshi

One Crore Subscription Completed For Modi Youtube: సోషల్‌ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడ‌ర్స్‌కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది.

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లతో దూసుకుపోతోంది నరేంద్ర మోదీ యూట్యూబ్‌ ఛానెల్‌. తాజాగా యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో మోదీనే టాప్‌. ఆయన దరిదాపుల్లో ఏ ప్రపంచ నేత కూడా లేకపోవడం విశేషం. రెండో ప్లేస్‌లో 36 లక్షల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో  ఉన్నారు. 

30.7 లక్షల సబ్‌స్క్రైబర్లతో మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో ఉండగా.. 28.8 లక్షల సబ్‌స్క్రైబర్లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కేవలం 7.03 ల‌క్షలు మాత్రమే. ఇటు.. దేశంలో మోదీ తర్వాత అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతలను గమనిస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ త‌ర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శశి థరూర్‌కి 4.39 లక్షలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్‌కి 2.12 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

2007 అక్టోబరు 26న నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ పప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలతో పాటు, బాలీవుడ్‌ ప్రముఖలతో పాల్గొన్న పలు వీడియోలు, క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి.

మిగతా వాటిల్లోనూ..
యూట్యూబ్‌తో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ ప్రధాని మోదీకి ఫాలోవర్లు ఎక్కువే. మోదీ ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.53 కోట్లు కాగా, ఆయన ఫేస్‌బుక్‌ను 4.68 కోట్ల మంది అనుస‌రిస్తున్నారు.

మరిన్ని వార్తలు