తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి

27 Sep, 2020 02:46 IST|Sakshi

శ్రీలంక ప్రధాని రాజపక్సకు మోదీ సూచన

న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్‌ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు.

1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్‌ డాలర్ల సాయం అందించనున్నట్లు  ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు.

>
మరిన్ని వార్తలు