ఈనెల 31 నుంచి సీప్లేన్‌ సేవలు షురూ

22 Oct, 2020 16:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న గుజరాత్‌లో తొలి సీప్లేన్‌ సర్వీసును  ప్రారంభించనున్నారు. తొలి విమానం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ నుంచి టేకాఫ్‌ అయి నర్మదా జిల్లాలోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీకి చేరుకుంటుంది. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఈనెల 31న సీప్లేన్‌ లాంఛ్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సబర్మతీ తీరం నుంచి కేవడియాలోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వరకూ రాష్ట్రంలో నిరంతరాయంగా అందుబాటు ధరలో ఎయిర్‌ కనెక్టివిటీని తొలిసారిగా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. దేశంలో ఇదే తొలి సీప్లేన్‌ సర్వీసు కావడం గమనార్హం.

12 మంది ప్రయాణీకులు కూర్చునేలా ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ ఈ సీప్లేన్‌ సర్వీసులను నిర్వహిస్తోంది. అహ్మదాబాద్‌ నుంచి కేవడియా వరకూ రోజుకు నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కో​ వ్యక్తి నుంచి టికెట్‌ ధరగా రూ 4,800 వసూలు చేస్తారు. అహ్మదాబాద్‌ కేవడియా మధ్య ప్రస్తుతం నాలుగు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం సీప్లేన్‌ అందుబాటులోకి రావడంతో గంటకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సబర్మతీ తీరం నుంచి ధరోయికి సీప్లేన్‌లో ప్రయాణించారు. చదవండి : పండగ సీజన్‌లో అప్రమత్తత అనివార్యం : మోదీ

>
మరిన్ని వార్తలు