కాలానుగుణంగా బోధనలో మార్పులు! 

8 Sep, 2021 07:15 IST|Sakshi

ప్రధాని మోదీ ఉద్బోధ 

శిక్షక్‌ పర్వ్‌ ప్రారంభం  

న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు బోధన– అభ్యసన పద్ధతులను కాలానుగుణంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో పలు నూతనాంశాలను ప్రధాని ఆవిష్కరించారు. ఇవన్నీ భవిష్యత్‌ భారత రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షక్‌ పర్వ్‌ కార్యక్రమంలో ఆయన ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. విద్యారంగంలో కొత్త విధానాలు మన యువతను భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దుతాయని అభిప్రాయపడ్డారు.

‘మన విద్యారంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడానికి బోధన–అభ్యసన ప్రక్రియలను ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకోవాలి. వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన సాంకేతికతలను వేగంగా అలవరచుకోవాలి. ఇలాంటి మార్పుల కోసం దేశం ఉపాధ్యాయులను సిద్ధం చేస్తోంది. మనమిప్పుడు మార్పు దశలో ఉన్నాము. మనకు ఆధునిక నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) అందుబాటులో ఉంది.

ఈ మార్పులు కేవలం విధానపరమైనవే కావు, ఇవి భాగస్వామ్య ఆధారిత మార్పులు. కోవిడ్‌ సందర్భంగా మన విద్యావ్యవస్థ సామర్థ్యాన్ని అందరూ చూశారు.  ఆన్‌లైన్‌ క్లాసులు, గ్రూపు వీడియో కాల్స్, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ అనేవి అంతకుముందు ఎరగని అంశాలు. అయినా మనం అనేక సవాళ్లను తక్షణం పరిష్కరించుకున్నాం’’ అని మోదీ చెప్పారు. ఎన్‌ఈపీ రూపకల్పనలో ఎందరో విద్యావేత్తలు పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.  

నూతన ఆవిష్కరణలు 
శిక్షక్‌ పర్వ్‌లో భాగంగా మోదీ ఇండియన్‌ సైన్‌లాంగ్వేజి డిక్షనరీ, ఆడియో పుస్తకాలు, టాకింగ్‌ బుక్స్‌ను విడుదల చేశారు. సీబీఎస్‌ఈకి అవసరమైన స్కూల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ విధానాలు, నిపుణ్‌ భారత్‌ కోసం నిష్టా టీచర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం, పాఠశాలల అభివృద్దికి సంబంధించిన విద్యాంజలి పోర్టల్‌ ఆవిష్కరించారు. దివ్యాంగుల కోసం విడుదల చేసిన టాకింగ్, ఆడియో బుక్స్, సైన్‌లాంగ్వేజి డిక్షనరీ విద్యారంగంలో సమానత్వ, సమ్మిళితత్వానికి ఉపయోగపడతాయన్నారు.

తమ ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావడంలో దేశ ప్రజల సహకారం ఎంతగానో ఉందని  కొనియాడారు. 2021 శిక్షక్‌ పర్వ్‌ థీమ్‌గా క్వాలిటీ అండ్‌ సస్టైనబుల్‌ స్కూల్స్‌: లెర్నింగ్‌ ఫ్రమ్‌ స్కూల్స్‌ ఇన్‌ ఇండియా ఎంచుకున్నారు. కార్యక్రమం సందర్భంగా పారాఒలంపిక్స్, ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన విజేతలను గుర్తు చేసుకున్నారు.

చదవండి: ప్రధాని చొరవతోనే పైక్‌ తిరుగుబాటుకు జాతీయ గుర్తింపు 

మరిన్ని వార్తలు