దేశం కోసమే నా తపన

20 Nov, 2022 09:32 IST|Sakshi

 365 రోజులు.. 24/7 పని చేస్తున్నాం

నేను పునాదిరాయి వేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభిస్తున్నా: ప్రధాని మోదీ

అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

ఈటానగర్‌: ‘‘మా ప్రభుత్వం దేశ ప్రగతి కోసం 365 రోజులూ, 24/7 పని చేస్తోంది. నేనూ రోజంతా దేశం కోసమే శ్రమిస్తున్నా. ఈ రోజు ఉదయం ఇలా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నా. తర్వాత వారణాసి వెళ్తా. సాయంత్రానికల్లా దేశానికి మరోవైపున ఉన్న గుజరాత్‌కు చేరుకుంటా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అరుణాచల్‌లో రాజధాని ఈటానగర్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని హొలోంగీలో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ‘డోన్యీ పోలో ఎయిర్‌పోర్ట్‌‘ను ఆయన శనివారం ప్రారంభించారు. సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి ఇది దోహదపడనుంది. దీని నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో మోదీ పునాదిరాయి వేశారు. ‘‘నేను పునాదిరాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. పనుల్లో కాలయాపన జరిగే రోజులు పోయాయి. అన్నింటినీ రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలి. ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు ఎన్నికల గిమ్మిక్కన్నారు. కానీ, ఇప్పుడిక్కడ ఎన్నికల్లేకున్నా ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాం. సదరు వ్యాఖ్యాతలకు ఇది చెంపదెబ్బ లాంటిది’’ అని ఈ సందర్భంగా ఆయనన్నారు.

అనుసంధానం, విద్యుత్‌ మౌలిక సదుపాయాలతో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో నూతన ఉషోదయం కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వం ఇక్కడి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ‘‘ఈశాన్య రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్లలో ఏడు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాం. టూరిజం, వాణిజ్యం, టెలికాం, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. మాకు ప్రగతే ముఖ్యం. ఎన్నికలు కాదు’’ అన్నారు. అరుణాచల్‌లోని తూర్పు కెమాంగ్‌ జిల్లాలో నిర్మించిన 600 మెగావాట్ల కెమాంగ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టును మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. రూ.8,450 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో అరుణాచల్‌లో విద్యుత్‌ కొరత తీరిపోనుంది.

కాశీ, తమిళనాడు..కాలాతీత సాంస్కృతిక కేంద్రాలు
వారణాసి: మన దేశంలో కాశీ, తమిళనాడు కాలాతమైన గొప్ప సాంస్కృతిక, నాగరికత కేంద్రాలని మోదీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయం. కాశీలో విశ్వనాథ మందిరం, తమిళనాడులో రామేశ్వరం కొలువుదీరాయి. తమిళ సీమలో దక్షిణ కాశీ ఉంది’’ అన్నారు. ‘ఏక్‌ భారత్, శ్రేష్ట్‌ భారత్‌’తో భాగంగా కాశీ తమిళ సంగమం నిర్వహించారు. తమిళనాడు నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. నెల రోజులపాటు ఎగ్జిబిషన్‌ జరుగనుంది. చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. 

మరిన్ని వార్తలు