ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!

23 Sep, 2020 03:38 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ

ఘనంగా 75వ వార్షికోత్సవాలు

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ కాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు పురాతన కాలం నాటి వ్యవస్థలు ఉపయోగపడవని ఆయన సోమవారం ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో కుండబద్దలు కొట్టారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌లో 193 సభ్యదేశాల జనరల్‌ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. భాగస్వాములందరికీ గొంతునిచ్చే, మానవ సంక్షేమంపై దృష్టి పెట్టే సరికొత్త ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ఏర్పాటు కావాలని పునరుద్ఘాటించారు. ఐరాస భద్రతా మండలిలో భారతదేశ తాత్కాలిక సభ్యత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. సమగ్రమైన సంస్కరణలు తీసుకు రాకపోతే ఐక్యరాజ్యసమితి వ్యవస్థ విశ్వసనీయత సంక్షోభంలో పడుతుందని ఆయన అన్నారు. ‘75 ఏళ్ల క్రితం యుద్ధభీతి నేపథ్యంలో ఓ కొత్త ఆశ చిగురించింది. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మొత్తం ప్రపంచానికి ఒక వ్యవస్థ సృష్టి జరిగింది’ అని అన్నారు. 

ప్రపంచం మారిపోయింది
ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం ఎంతో మారిపోయిందని జనరల్‌ అసెంబ్లీ సభ్యదేశాలన్నీ కలిపి చేసిన తీర్మానం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముందని, మరింత ఎక్కువ దేశాలకు, ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని కోవిడ్‌–19 లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు∙సన్నద్ధతతో ఉండాలని తీర్మానం ద్వారా పిలుపునిచ్చారు.

ఆన్‌లైన్‌లో ఐరాస 75వ వార్షిక సమావేశాలు 
కోవిడ్‌ నేపథ్యంలో ప్రధాన దేశాధినేతల ముందుగా రికార్డు చేసిన ఉపన్యాసాలతో ఐక్యరాజ్యసమితి ప్రపంచా ధినేతల తొలి ఆన్‌లైన్‌ సమావేశం మంగళవారం ప్రారంభమైంది.  75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రారంభ సమావేశం జరిగింది.  193 సభ్య దేశాల ఉపన్యాసాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో కోవిడ్‌ మహమ్మారి ప్రధానాంశంగా ఉంది. ఈ ఆన్‌లైన్‌ సమావేశాల్లో వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు రికార్డు స్థాయిలో మాట్లాడనున్నారు. ఈసారి మంత్రులు, రాయబారులకు బదులు ముఖ్యనేతలు పాల్గొనడం విశేషం.

మరిన్ని వార్తలు