రైతన్నలూ.. చర్చలకు రండి

11 Dec, 2020 02:14 IST|Sakshi
ఘాజీపూర్‌ వద్ద పోలీసులకు టీ అందజేస్తున్న రైతు

అనుమానాలు నివృత్తి చేస్తాం 

చర్చల తేదీని రైతు సంఘాలే నిర్ణయించవచ్చు 

కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, పీయూష్‌ గోయెల్‌ పిలుపు 

చట్టాల పూర్తి రద్దు కుదరదని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్‌ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్‌ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్‌  మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్‌ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్‌ ఆక్షేపించారు.   

కొత్త చట్టాలతో ఎంఎస్‌పీకి ఢోకా లేదు  
కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్‌పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్‌ గోయెల్‌ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్‌ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు.   

సివిల్‌ కోర్టుల్లో అప్పీల్‌ చేసుకోవచ్చు  
రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్‌ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్‌ విధించవచ్చని వివరించారు. 

వివాదాల పరిష్కారం కోసం సివిల్‌ కోర్టుల్లో అప్పీల్‌ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్‌ కోర్టుల్లో అప్పీల్‌ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్‌ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ కింద సాగు భూములను అటాచ్‌ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్‌ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు.   
 

రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి
ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్‌ తోమర్, పీయూస్‌ గోయెల్‌ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు.

కార్పొరేట్ల కోసమే..
కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ  వ్యవసాయ మంత్రి తోమర్‌ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది.

14 రోజుల్లో 15 మంది..
చండీగఢ్‌: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో  15 మంది  వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్‌లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్‌కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు.

రైలు పట్టాలపై పోరాటం!
సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే  ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్‌లపై పోరాటం తప్పదని, ఇది  పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు