సాగు చట్టాలు.. కొలిక్కిరాని చర్చలు

30 Dec, 2020 19:57 IST|Sakshi

ఢిల్లీ : రైతు సంఘాలతో బుధవారం కేంద్రం​ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సుమారు 5 గంటలకుపైగా కొనసాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశాలు ఎలాంటి కొలిక్కి రాలేదు. కాగా జనవరి 4న మరోసారి కేంద్రంతో రైతు సంఘాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా మద్దతు ధర విషయంపై కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలిస్తుంది. వాయుకాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణలకు సముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్‌ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం మొగ్గుచూపింది. (చదవండి : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు)

ఇదే విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. రెండు అంశాలపై రైతు సంఘాలతో అంగీకారానికి వచ్చామన్నారు. రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందన్నారు. కొత్త చట్టాల పై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని .. కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. కేంద్ర జరిపిన చర్చలు కాస్త సానుకూల ధోరణిలోనే సాగాయని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై కేంద్రం తర్జన భర్జన పడుతుందని.. అందుకే చర్చలు అసంపూర్తిగా ముగిశాయని వారు తెలిపారు. అయితే ముందుగా అనుకున్న ట్రాక్టర్‌ ర్యాలీని వాయిదా వేస్తున్నామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.

కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తున్న అంశాలు
రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు
విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం

అంగీకరించని అంశాలు:
3 చట్టాలను రద్దు చేయడం
కనీస మద్దతు ధరపై చట్టం తేవడం

మరిన్ని వార్తలు