నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత

20 Feb, 2021 17:32 IST|Sakshi

కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

1962లో నాగాలాండ్‌ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్‌ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. 

అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్‌ షరిన్‌గైర్‌ లాంగ్‌కుమార్‌ నేతృత్వంలో నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది.
 

మరిన్ని వార్తలు