National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్‌ మేళా

7 Jan, 2023 16:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్‌ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్‌ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్‌ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు.

ఏమేమీ కావాలి..
రెజ్యూమ్ మూడు కాపీలు
మార్క్‌షీట్లు, సర్టిఫికెట్‌ మూడు కాపీలు
ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్)
మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఎక్కడెక్కడంటే...
తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్‌ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్‌), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్‌ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్‌ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్‌ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్‌) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్‌ కడప)ల్లో  ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు)

మరిన్ని వార్తలు