జైళ్లలో ఖైదీలకన్నా నిందితులే ఎక్కువ!

10 Sep, 2020 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఖైదీలు కాకుండా నేర విచారణను ఎదుర్కొంటున్న నిందితుల నిర్బంధంతోనే నేడు దేశంలోకి జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ 2019లో విడుదల చేసిన డేటా ప్రకారం 4,78,600 మంది జైలు నిర్బంధంలో ఉండగా, వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు కేసు విచారణను ఎదుర్కొంటోన్న నిందితులే. నిందితుల్లో 37 శాతం మంది అన్యాయంగా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడుపుతున్న వారే. ఫలితంగా వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడమే కాకుండా రెగ్యులర్‌ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. (చదవండి : కరోనా టెస్టులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం)

జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 64 శాతం మంది వెనకబడిన, నిమ్న వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎస్సీలకు చెందిన వారు 21.7 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారు 12.3 శాతం, వెనకబడిన వర్గాలకు చెందిన వారు 30 శాతం మంది ఉన్నారు. ప్రతి ఐదుగురు నిందితుల్లో ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు. దారిద్య్రక పరిస్థితులు, ఉచిత న్యాయ సహాయం దొరక్క పోవడం వల్లనే ఈ వర్గాలకు చెందిన వారు జైళ్లలో మగ్గుతున్నారని సామాజిక శాస్త్రవేత్తలు తేల్చారు. 


ప్రపంచంలో 14 దేశాల్లో మాత్రమే విచారణ ఎదుర్కొంటోన్న నిందితులు జైళ్లలో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోకెల్లా లిబియాలోనే అత్యధికంగా అండర్‌ ట్రయల్స్‌ జైళ్లలో మగ్గుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా శాన్‌ మారినో, బంగ్లాదేశ్, గబన్, పరాగ్వే, బెనిన్, హైతి, ఫిలిప్పీన్స్, కాంగో, కాంబోడియా, బొలీవియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, నైజీరియా, యెమెన్‌ దేశాలుండగా, 15వ స్థానంలో భారత్‌ ఉంది. (చదవండి : భారత్‌లో పబ్‌జీ కథ ముగిసినట్లేనా?)

విచారణ ఎదుర్కొంటోన్న నిందితుల్లో ఎక్కువ మంది వెనకబడిన,దళిత వర్గాలకు చెందిన వారే కావడం ఒక్క భారత దేశానికి పరిమితం కాలేదని, ప్రపంచంలోనే పలు దేశాల్లో కొనసాగుతోందని, ఇది సమాజంలోని అసమానతలను, వివక్షతలకు అద్దం పడుతోందని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ‘సెంటర్‌ ఫర్‌ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌’ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ విజయ్‌ రాఘవన్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు