నేషనల్‌ హెరాల్డ్‌ కేసు: రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ.. మూడు గంటలపాటు ప్రశ్నల వర్షం

13 Jun, 2022 14:57 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు భోజన విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లిన రాహుల్‌ను.. మూడు గంటలపాటు విచారించారు అధికారులు. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి రాహుల్‌ గాంధీ ఇంటికి వెళ్లిపోయారు. లంచ్‌ తర్వాత తిరిగి ఆయన ఈడీ ఆఫీస్‌కు రానున్నట్లు సమాచారం.

సోమవారం ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మూడు గంటల పాటు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులు, యంగ్‌ఇండియాతో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు అధికారులు. 

మరోవైపు రాహుల్‌ ఈడీ విచారణ సందర్భంగా.. దేశం మొత్తం కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ బయట కూడా భారీ పార్టీ శ్రేణులతో నిరసనల మధ్యే రాహుల్‌ గాంధీ లోపలికి ప్రవేశించారు. అనుమతి నిరాకరణతో ఆయన ఒక్కరే లోపలికి వెళ్లారు.

మరోవైపు చాలాచోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్టుల పర్వం జరిగింది. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా.. అరెస్ట్‌ అయి తుగ్లకు రోడ్‌ జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించారు కూడా.

చదవండి: నేషనల్‌ హెరాల్డ్‌ కేసేంటి?.. అసలేం జరిగిందంటే..

మరిన్ని వార్తలు