నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ

27 Jul, 2022 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ మూడు రోజులు విచారించింది. మొత్తం 12 గంటలపాటు సోనియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించింది. అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లే తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు తాజా సమన్లు జారీ చేయలేదు.

ఇక సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా  పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. తమను ఎటో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారని ట్వీట్ చేశారు.  

మరోవైపు  సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినందుకు నిరసనగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బ్రూట్ ఫోర్స్‌ను ఉపయోగించారని, ఢిల్లీ పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని  ఆయన ఆరోపించారు. 
చదవండి: ఈడీనే కరెక్ట్‌.. అరెస్ట్‌లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు