National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం

27 Jul, 2022 02:13 IST|Sakshi
ఈడీ కార్యాలయానికి వస్తున్న సోనియా

మరోసారి దర్యాప్తు సంస్థ ఎదుటకు కాంగ్రెస్‌ అధినేత్రి  

న్యూఢిల్లీ:  నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె ఉదయం 11 గంటలకు తన కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రాతో కలిసి సెంట్రల్‌ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రియాంక తన తల్లి సోనియా వెంటే ఉండగా, రాహుల్‌ అక్కడి నుంచి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. సమన్ల పరిశీలన, హాజరు పత్రంపై సంతకాల తర్వాత ఉదయం 11.15 గంటలకు విచారణ ప్రారంభమయ్యింది. అధికారులు పలు కీలక అంశాలపై సోనియాను ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రియాంక ఈడీ ఆఫీసులోని మరో గదిలో ఉండిపోయారు.

దాదాపు 2.50 గంటలపాటు విచారణ అనంతరం మధ్యాహ్నం భోజనం కోసం సోనియా 2 గంటలకు బయటకు వెళ్లారు. 3.30 గంటలకు తిరిగివచ్చారు. ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. మళ్లీ 3 గంటలపాటు సోనియాను ప్రశ్నించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సోనియాకు సూచించారు.  

ఆ సంస్థల్లో మీ పాత్ర ఏమిటి?  
సోనియా నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకూ ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ సిబ్బంది సైతం మోహరించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నెల 21న సోనియా ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికతోపాటు యంగ్‌ ఇండియా సంస్థ కార్యకలాపాల్లో సోనియా, రాహుల్‌ గాంధీ పాత్రపై మంగళవారం అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యంగ్‌ ఇండియాలో మెజారిటీ వాటాదారు అయిన రాహుల్‌ని ఈడీ గత నెలలో విచారించింది.  

రాహుల్‌ గాంధీ అరెస్టు  
సోనియా గాంధీను ఈడీ  విచారించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్‌ గాంధీ సహా పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, నాయకులు విజయ్‌ చౌక్‌ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాంగ్రెస్‌ ఎంపీలు విజయ్‌చౌక్‌ వద్ద రోడ్డుపై బైఠాయించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌సహా ఎంపీలను అరెస్ట్‌ చేశారు. వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు.  ధర్నా సందర్భంగా పోలీసులు తన పట్ల కర్కశంగా వ్యవహరించారని, వాహనంలోకి నెట్టేశారని అఖిల భారత యువజన కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌ ఆరోపించారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, గిడుగు రుద్రరాజు, చల్లా వంశీచంద్‌రెడ్డి, సీనియర్‌ నేతలు కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు