రహదారులే రన్‌వేలు

10 Sep, 2021 02:33 IST|Sakshi
రాజస్తాన్‌లో రహదారిపై ల్యాండ్‌ అయిన సుఖోయ్‌ యుద్ధవిమానం

జాతీయ రహదారులపై యుద్ధ విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

రాజస్తాన్‌లో సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ

19 మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు గడ్కరీ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే.

యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నా«థ్‌సింగ్, గజేంద్రసింగ్‌ షెకావత్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం ఈ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్‌–30ఎంకేఐ ఫైటర్‌ జెట్, ఏఎన్‌–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు  మార్గాల్లో..
అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ తరహా స్ట్రెచ్‌ నిర్మించడం ద్వారా దేశ ఐక్యత, వైవిధ్యం, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత ఖర్చయినా వెనకాడం అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యిందని రక్షణ మంత్రి రాజ్‌నా«థ్‌ అన్నారు. ఎన్నో హెలిప్యాడ్‌ల నిర్మాణంలో జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని తెలిపారు. రక్షణపరమైన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ... సైన్యానికి జాతీయ రహదారులు సైతం ఉపకరించడం దేశాన్ని మరింత సురక్షితం చేస్తుందని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఫ్లైఓవర్‌ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్‌ వరకు రన్‌వే నిర్మాణంలో ఉంది.  ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం సట్టా–గాంధవ్‌ మార్గంతోపాటు గగారియా–బఖాసర్‌ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు.  అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్‌ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్‌లను నిర్మించారు.  తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.   
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ జంక్షన్‌ వద్ద సిద్ధమవుతున్న రన్‌వే 

మరిన్ని వార్తలు