National Lazy Day:  నేనైతే లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటా: బిల్‌గేట్స్‌

10 Aug, 2021 08:51 IST|Sakshi

లేజీ కాదు.. చాలా క్రేజీ!

అందరివీ బిజీబిజీ గజిబిజి జీవితాలు.. ఉన్న 24 గంటలూ సరిపోనంతగా ఉరుకులు పరుగులు పెడుతుంటాం.. మరి కొందరేమో సోఫాలోనో, బెడ్‌ మీదనో గంటలు గంటలు అలా గడిపేస్తారు. అయితే పని తప్పించుకోవడం, లేకుంటే ఎలాగోలా త్వరగా పూర్తిచేసి మళ్లీ ‘రెస్ట్‌ మోడ్‌’లోకి వెళ్లిపోవడమే వారి పని. బద్ధకం, సోమరితనం, మందకొడితనం.. ఇలా ఎలా పిలిచినా సరే.. లేజీనెస్‌ ఎంతో కొంత మంచిదేనట. దాని ప్రయోజనాలు దానికీ ఉన్నాయట. మరి ఈ మంగళవారం (ఆగస్టు 10) ‘లేజీ డే’ నేపథ్యంలో.. ఈ లేజీ క్రేజీ ముచ్చట్లేంటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

 ఉరుకులు..  పరుగుల నుంచి.. 
ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్న.. ‘టు–డు’ లిస్టుల బతుకులు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్‌’ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్‌ ‘రిపేర్‌’ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్‌’ అలవర్చుకోవాలని చెప్తున్నారు.  

8 విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేస్తుంటారని.. అక్కడ నిజంగా విశ్రాంతి ఎక్కడుంటుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ‘లేజీనెస్‌’ అంటే.. ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి.. మీకు నచి్చన ఫుడ్‌ తిని, మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్‌ మీదో బద్ధకంగా పడిపోవడం అని చెప్తున్నారు. 

‘సోమరితనం’ కూడా చికిత్సనే.. 
బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని.. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కానీ లేజీగా గడపడం కోసం.. సమయం వృధా చేస్తున్నామనే ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు మీ గురించి మీరు తీసుకునే శ్రద్ద.. రేపటి మీ జీవితంపై శ్రద్ధకు తోడ్పడుతుందని అంటున్నారు. 

పరిమితి దాటితే  ప్రమాదం.. 
లేజీగా ఉండాలన్నారు కదా అని.. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. ఇది ఒకస్థాయి దాటితే జీవితంలో మనకు అవసరమైన వాటిపైనా నిర్లక్ష్యం చేసే దశకు చేరుతామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల దురలవాట్లకు కారణాల్లో సోమరితనం ఒకటి. ఏదైనా సులువుగా చేయలనుకోవడం ‘లేజీనెస్‌’ ప్రధాన లక్షణమైతే.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డాదారిలో వెళ్లడమూ అందులో భాగమే. కేవలం ‘రీఫ్రెష్‌’ కావడానికి మాత్రమే లేజీనెస్‌ను పరిమితం చేయాలి మరి. 

లేజీ లేజీగా..  ఏం చేద్దాం? 

  • మీకు నచ్చిన ఏదో ఒక రోజును పూర్తిగా మీకు కేటాయించుకోండి. ముఖ్యంగా డబ్బు, ఇతర సమస్యలను పూర్తిగా పక్కనపెట్టండి. ఆందోళనలను పూర్తిగా వదిలేయండి.
  • పొద్దున్నే లేవడం, అలారం పెట్టుకోవడాన్ని పక్కనపెట్టి.. మీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవండి. 
  • హాయిగా వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. సోఫాలో, బెడ్‌పై ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా సుఖంగా ఉండేలా చూసుకోండి. 
  • టీవీలోనో, ఫోన్‌లోనో నచ్చిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తూ గడపండి. ఎట్లాంటి ఆలోచనలూ పెట్టుకోకండి. అలా బద్ధకంగా కూలబడి.. నచి్చన సంగీతం, పాటలు వినండి. 
  • ఫోన్‌లో నోటిఫికేషన్లను ఆఫ్‌ చేసేయండి. వీలైతే ఆ రోజు ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టేయండి. 
  • వంట పని వంటివి కూడా పెట్టుకోవద్దు. అలాగైతే తిండి ఎలా అనే డౌట్‌ వద్దు. ఆ ఒక్కరోజు బయటి నుంచి నచ్చిన ఫుడ్‌ తెప్పించుకుని.. నచ్చినట్టుగా తినండి.
  • ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు.

లేజీ.. ముచ్చట్లు  ఎన్నో.. 

  • లేజీనెస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు తాము కనుగొన్న అంశాలతో రిపోర్టులు విడుదల చేశారు. 
  • మనం చురుగ్గా ఉండటానికి డోపమైన్‌ అనే ప్రొటీన్‌ కీలకం. అది మెదడును ఉత్తేజపరుస్తుంది. కానీ కొందరిలో మెదడులోని డోపమైన్‌ గ్రాహకాల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో వారు ఎంతగా ప్రయత్నించినా యాక్టివ్‌గా ఉండలేకపోతారు. స్కాట్లాండ్‌ శాస్త్రవేత్తలు దీనికి మందు రూపొందించే పనిలో ఉన్నారు. 
  • ఎవరైనా లేజీగా ఉండిపోతే.. మెదడు రెగ్యులర్‌ యాక్టివిటీని ఆపేసి, పగటికలలు, సృజనాత్మక అంశాలపై దృష్టిపెడుతుందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. చిత్రమేమిటంటే ఆ సమయంలో మెదడులో యాక్టివ్‌గా ఉండే భాగమే.. మనం మన భవిష్యత్తుపై ఆలోచనలు కూడా చేస్తుందని వెల్లడించారు. 
  • లేజీగా ఉండేవారు సమస్యలను పరిష్కరించడానికి సులువైన మార్గాలను వెతుకుతారని పరిశోధకులు నిరూపించారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘పెర్ల్‌’ను రూపొందించిన లారీ వాల్‌ కూడా ఇదే చెప్పారు. ప్రోగ్రామ్‌ల కోసం వేల లైన్ల కోడ్‌ రాయాల్సి ఉంటుందని.. అదే లేజీగా ఉండేవారు తక్కువ లైన్లలో ప్రోగ్రామ్‌ రాసే ప్రయత్నం చేస్తారన్నారు. 

ఇది అనారోగ్య  సమస్య కాదు 
సోమరితనం అనారోగ్య సమస్య అని చాలా మంది అనుకుంటారని.. ఆ ఆలోచనే తప్పు అని ‘కాంటెంపరరీ సైకోఅనలైసిస్‌ గ్రూప్‌’కు చెందిన సైకాలజిస్టు లారా మిల్లర్‌ తెలిపారు. ఇతరుల్ని తప్పుపట్టడానికి దీన్ని వాడతారన్నారు. కొందరు లేజీగా కనిపించడానికి చదువు, పని, ఏదైనాగానీ తమ వల్ల కాదేమోనన్న భయం అందుకు కారణమవుతుందని వివరించారు. ఏదైనా కోల్పోవడం, కోల్పోతామన్న భయం, ఓటమి, డిప్రెషన్‌ వంటివి లేజీనెస్‌కు దారితీస్తాయని.. మనసులో గట్టిగా కోరుకుంటే సులువుగా బయటపడొచ్చన్నారు. 

 నేనైతే లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటా!
‘ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను అలాంటివారే గుర్తించగలరు..’ – మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌

చదవండి: గిన్నిస్‌ రికార్డు పసికందు.. శ్రమించి ఊపిరి నిలిపిన డాక్టర్లు   

మరిన్ని వార్తలు