పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా. అయితే ఇవి పంపండి

21 Jul, 2021 16:48 IST|Sakshi

National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్‌డెస్క్‌: గత వేసవి ఆరంభం... బెంగాల్‌ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు.  అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే,

వేల ఏళ్ల క్రితమే
క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన  మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి  ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా  దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. 


జులై 22న 
ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్‌ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది.  

స్నేహ హస్తం
భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి  మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్‌ ప్రధాని నుంచి  ప్రతీ ఏడు భారత్‌, పాక్‌ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సైతం తన ఫామ్‌హౌజ్‌లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు.

మామిడి @ 1000
మామిడి పళ్లకు ఉన్న డిమాం‍డ్‌ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన నూర్జహాన్‌ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్‌.

విటమిన్‌ సీ 
కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్‌ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్‌ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. 

 లో షుగర్‌ మ్యాంగో
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అల్లాహార్‌లోని ఎంహెచ్‌ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి  ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్‌ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. 

నూజివీడు స్పెషల్‌
నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్‌ కొరియా, ఒమన్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

పచ్చళ్లు
చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్‌. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్‌ అయిపోయింది. 

మరిన్ని వార్తలు