అజ్ఞాత విరాళాలతో రూ. 3,370 కోట్లు సమీకరణ

1 Sep, 2021 06:40 IST|Sakshi

జాతీయ పార్టీలపై ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్‌నౌన్‌ సోర్సెస్‌) నుంచి సమీకరించాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫా మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం  70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌(రూ.526కోట్లు), ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్‌పీ ఉన్నాయని తెలిపింది. మొత్తం సొమ్ములో ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం ద్వారా రూ. 2,993.82 కోట్లు లభించాయని ఏడీఆర్‌ వెల్లడించింది.

2004–05 నుంచి 2019–20 మధ్య కాలంలో ఈ అంతుచిక్కని మార్గాల్లో పార్టీలు సమీకరించిన మొత్తం రూ. 14,651. 53కోట్లని వివరించింది. 2019–20 కాలంలో పార్టీలు సేకరించిన నగదు రూపంలో సేకరించిన మొత్తం రూ.3.18లక్షలు మాత్రమే కావడం గమనార్హం. రూ.20వేలకు పైబడిన విరాళాలకు పార్టీలు రసీదులు జారీ చేయాల్సిఉంటుంది. అయితే రూ.20వేల లోపు ఇచ్చే విరాళాల దాతల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా రూ. 20వేల లోపు విరాళాన్ని ఇచ్చే వర్గాలను అజ్ఞాత వర్గాలంటారు. వీటిని ఐటీ పత్రాల్లో అన్‌నౌన్‌ సోర్సుగా పేర్కొంటారు. ఈ నిధులు ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల వివరాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల విక్రయాలు, రిలీఫ్‌ పండ్‌ లాంటివన్నీ ఈ అజ్ఞాత మార్గాల కిందకు వస్తాయి.

మరిన్ని వార్తలు