National Technology Day: ప్రకృతే పెద్ద సైంటిస్ట్‌!

11 May, 2021 08:36 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: ప్రకృతి నిండా ఎన్నో టెక్నాలజీలు. ప్రతి సమస్యకు, ప్రతి అవసరానికి ప్రకృతిలో ఓ పరిష్కారం రెడీగా ఉంటుంది. దాన్ని గుర్తించి, మన అవసరాలకు తగినట్టుగా మలచుకోగలిగితే చాలు. ఎప్పుడో ఆది మానవుల నుంచి ఇప్పుడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల దాకా ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది ఆవిష్కరణలు చేసినవారే. ఈ మధ్య కూడా అలాంటివెన్నో కనిపెట్టారు. నేడు (మే 11న) నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా అలాంటి కొన్ని ఆవిష్కరణలేంటో చూద్దామా? 

► కందిరీగ.. సర్జరీ నీడిల్‌ 
అవసరం: మెదడు వంటి అత్యంత సున్నిత అవయవాలకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు.. కణాలు దెబ్బతినకుండా వాడగలిగే నీడిల్‌


ప్రకృతి పరిష్కారం: ఓ రకం కందిరీగ 
వుడ్‌ వాస్ప్‌గా పిలిచే ఓ రకం కందిరీగ.. తన తొండం వంటి నిర్మాణంతో చెట్ల కాండానికి రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. శాస్త్రవేత్తలు దీని ఆధారంగా మెదడు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ప్రత్యేకమైన నీడిల్‌ను రూపొందించారు. 

► తిమింగలాలు.. మోటార్‌ బ్లేడ్లు 
అవసరం: గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే విండ్‌ టర్బైన్లు మరింత సమర్థవంతంగా, తక్కువ ధ్వని చేస్తూ పనిచేయాలి. ఉత్పత్తి సులువు కావాలి.

ప్రకృతిలో దొరికిన పరిష్కారం: హ్యాంప్‌బ్యాక్‌ తిమింగలం రెక్కలు 
ఈ రకం తిమింగలాల్లో రెక్కల అంచులు ఎగుడుదిగుడుగా ఓ ప్రత్యేక నిర్మాణం (ట్యూబర్‌కల్స్‌) తో ఉంటాయి. దీంతో వేగంగా ఈదగలుగుతాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వేల్‌ పవర్‌ కార్పొరేషన్‌  సంస్థ విండ్‌ టర్బైన్ల రెక్కల అంచులకు ట్యూబర్‌కల్స్‌ డిజైన్‌ను చేర్చింది. దీనివల్ల టర్బైన్ల సామర్థ్యం పెరిగినట్టు గుర్తించింది. ఈ మోడల్‌ను టర్బైన్లకే గాకుండా ఫ్యాన్లు, కంప్రెసర్లు, మోటార్లలోనూ వాడొచ్చని చెబుతోంది. 

► ఆల్చిప్పలు.. ఆక్సెటిక్‌ మెటీరియల్‌ 
అవసరం: గట్టిగా సాగదీసినా, తీవ్ర ఒత్తిడికి లోనైనా ఎదుర్కొని.. మరింత మందంగా, బలంగా మారే మెటీరియల్‌ (ఆక్సెటిక్‌) తయారీ.
 
ప్రకృతిలో దొరికిన పరిష్కారం: ఆల్చిప్పలు 
ఆల్చిప్పల లోపలి పొర నిర్మాణం ‘ఆక్సెటిక్‌’తరహాలో ఉంటుంది. ఆల్చిప్పను తెరవడానికి ప్రయత్నించిన కొద్దీ ఆ పొర మరింత మందంగా, బలంగా మారి అడ్డుకుంటుంది. ఆ పొర నిర్మాణం తీరును గుర్తించిన శాస్త్రవేత్తలు.. వివిధ ఆక్సెటిక్‌ మెటీరియల్స్‌ను రూపొందించారు. క్రీడా పరికరాల్లో, ఔషధ రంగంలో, ప్యాకింగ్‌లో వాటిని వినియోగిస్తున్నారు. 

► నత్తలు.. ఆపరేషన్‌ గ్లూ 
అవసరం: శరీరంలో ఏదైనా అవయవానికి శస్త్రచికిత్స చేసినప్పుడు కోతపెట్టిన భాగాలు తిరిగి అతుక్కునేందుకు వీలయ్యే గమ్‌. 

ప్రకృతిలో దొరికిన పరిష్కారం: నత్తలు 
నత్తలు ముందుకు కదలడానికి శరీరం దిగువన ఓ జారుడు పదార్థాన్ని వదులుతూ ఉంటాయి. దాన్ని స్లగ్‌ స్లైమ్‌ అంటారు. ఇటు జారుడుగా ఉండటంతోపాటు కాస్త ఒత్తిడిపెడితే అత్యంత గట్టిగా అతుక్కునే జిగురుగానూ ఈ పదార్థం పనిచేస్తుంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలు.. శస్త్రచికిత్సల్లో కోత పెట్టిన అవయవాలను అతికించే సూపర్‌ గ్లూను రూపొందించారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ సూపర్‌ గ్లూతోనే అతికించి ప్రాణాలు కాపాడుతున్నారు. 

► షార్క్‌ చర్మం.. ఫాస్ట్‌ స్విమ్మింగ్‌ 
అవసరం: చాలా వేగంగా ఈత కొట్టడానికి వీలయ్యే దుస్తులు

ప్రకృతి పరిష్కారం: షార్క్‌ చేపల చర్మం 
ఈత కొడుతున్నప్పుడు నీళ్ల నుంచి ఎదురయ్యే ఘర్షణ వల్ల వేగం మందగిస్తుంది. అయితే షార్క్‌ చేపలు నీళ్లలో అత్యంత వేగంగా ఈదగలుగుతాయి. వాటికి ఉన్న ప్రత్యేకమైన చర్మం నీటి ఘర్షణను అధిగమించేందుకు తోడ్పడుతుంది. దాని నుంచి స్ఫూర్తి పొందిన స్పీడో అనే కంపెనీ.. ఫాస్ట్‌ స్కిన్‌  పేరిట ప్రత్యేక దుస్తులను తయారుచేసింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో మెడల్స్‌ పొందిన 98 శాతం క్రీడాకారులు ఈ దుస్తులను ధరించినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఈత పోటీల్లో ఆ దుస్తుల వాడకాన్ని నిషేధించారు. 

► చెదలు.. చల్లటి ఇండ్లు 
అవసరం: ఏసీల వంటివి అవసరం లేకుండా సహజ సిద్ధంగా చల్లగా ఉండే ఇండ్లు.

ప్రకృతి పరిష్కారం: చెదల పుట్టలు 
చెదలు పెట్టే పుట్టల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ఆ పుట్టల డిజైన్‌  గాలి ధారాళంగా ప్రసరిస్తూ, చల్లగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే తరహాలో అపార్ట్‌మెంట్లు, ఇండ్ల నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. ఇలాంటి డిజైన్‌తోనే జింబాబ్వేలోని హరారేలో ప్రఖ్యాత ఈస్ట్‌గేట్‌ సెంటర్‌ను నిర్మించారు.  

► మంతా రేస్‌.. సూపర్‌ స్పీడ్‌ విమానాలు 
అవసరం: తేలికగా, తక్కువ ఇంధన వినియోగంతో వేగంగా, ఎక్కువ దూరం వెళ్లే విమానాలు

ప్రకృతి పరిష్కారం: మంతా రేస్‌ 
మంతా రేస్‌ అనేవి బల్లపరుపుగా ఉండే ఓ రకం సముద్ర జీవులు. సముద్రంలో చప్పుడు రాకుం డా, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం. ఈ మంతా రేస్‌ శరీర నిర్మాణాన్ని అనుసరించి బోయింగ్, నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేక విమానాలను రూపొందిస్తున్నారు. బోయింగ్‌ కంపెనీ ఇప్పటికే ఎక్స్‌–48సీ మానవ రహిత విమానాన్ని తయారు చేసింది. ఇవి తక్కువ ఇంధనంతో వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణించగలవు. 

మరిన్ని వార్తలు