పులులకు ‘ఎండదెబ్బ’

1 Mar, 2023 06:15 IST|Sakshi

పదేళ్లలో 1,062 పులుల మృత్యువాత

వాటిలో వేసవి మరణాలే 348

సంరక్షణకు చర్యలు తీసుకోండి

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 34 పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.

2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి!

తస్మాత్‌ జాగ్రత్త
ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది.
  
వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు...
► ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం
► అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం
► ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు
► అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్‌ జోన్‌లు లేకపోవడం
► అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం

మరిన్ని వార్తలు